calender_icon.png 1 May, 2025 | 8:51 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

త్వరలో గ్రామాల్లో రెవెన్యూ సమావేశాలు !

01-05-2025 12:00:00 AM

భూ భారతితో భూ సమస్యలు పరిష్కారం జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు

పటాన్ చెరు/గుమ్మడిదల, ఏప్రిల్ 30 : నిర్ణీత గడువులోపు భూ సమస్యల పరిష్కారానికి భూభారతి చట్టం దోహదపడుతుందని కలెక్టర్ క్రాంతి వల్లూరు సూచించారు. భూమి హక్కుల రికార్డులలో ఏవైనా లోటుపాట్లు, తప్పులు ఉంటే వాటిని సవరించుకునేందుకు రాష్ర్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన ఈ నూతన ఆర్.ఓ.ఆర్ -2025 చట్టం వెసులుబాటు కల్పిస్తుందని అన్నారు.

గుమ్మడిదల, జిన్నారం మండల కేంద్రాలలో భూభారతి చట్టంపై బుధవారం రైతులకు నిర్వహించిన అవగాహన సదస్సుకు కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై  కొత్త చట్టం వల్ల రైతులకు, ప్రజలకు చేకూరే ప్రయోజనాలు, చట్టంలో పొందుపర్చిన కీలక అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ క్రాంతి వల్లూరు మాట్లాడుతూ ధరణి రికార్డులను భూ భారతిలో నమోదు చేయడం జరుగుతుందని తెలిపారు.

ప్రస్తుతం కొత్త ఆర్‌ఓఆర్ చట్టంలో పెండింగ్ దరఖాస్తులను ఆర్డీఓలు పరిశీలించి క్రమబద్ధీకరిస్తారని తెలిపారు. త్వరలో గ్రామాల వారీగా రెవెన్యూ సమావేశాలు ఉంటాయన్నారు. అనంతరం జిన్నారంలో ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన  ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని కలెక్టర్ పరిశీలించారు.

ఈ కార్యక్రమంలో అదనపు కలెక్టర్ మాధురి, జిల్లా వ్యవసాయ అధికారి  శివ ప్రసాద్, పఠాన్ చెరు నియోజకవర్గం ప్రత్యేకాధికారి దేవుజ, ఆర్డీవో  రవీందర్ రెడ్డి,  ఆత్మ కమిటీ చైర్మన్  శ్రీనివాస్ రెడ్డి , తహసీల్దార్లు  పరమేశ్, బిక్షపతి, రెవెన్యూ అధికారులు, రైతులు, రైతు సంఘాలు, మహిళలు, ప్రజా ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.