ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడిగా ‘అమరవాది’
మరోసారి ఎన్నిక
ఖైరతాబాద్, ఏప్రిల్ 4 (విజయక్రాంతి): ఇటీవల జరిగిన రాష్ట్ర ఆర్యవైశ్య మహాసభ ఎన్నికల్లో అమరవాది లక్ష్మీనారాయణ విజయం సాధించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆర్యవైశ్యులందరూ తనపైన మరొకసారి గురుతర బాధ్యతను వేశారని అన్నారు. హైదరాబాదులో చింతల్ బస్తిలో ఉన్న వాసవీ భవనంలో తెలంగాణకు 40శాతం, 60శాతం ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభకు హక్కు ఉన్న విషయం మనకు తెలిసిందేనన్నారు.
ఆ 60 శాతాన్ని కూడా కొనుగోలు చేసి ఈ భవనాన్ని పూర్తిగా ఆధునీకరణ చేసి ఒక కొత్త మంచి భవనం కట్టాలని నిర్ణయించామన్నారు. అలాగే ఉప్పల్ భగాయత్‌లో మనకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా వచ్చిన ఐదెకరాల స్థలంలో ఆర్థిక వనరులను సమకూర్చే ఒక మంచి భవనాన్ని నిర్మించాలని అలాగే ఇటీవల మనకు సీతమ్మ ట్రస్ట్ ద్వారా తిరుపతిలో మనకు 2000 గజాల స్థలం ఇచ్చిన విషయం మనందరికీ తెలుసు ఆ స్థలంలో పునాది రాయి కూడా వేసుకున్నామన్నారు.
అక్కడ కూడా తెలంగాణ నుంచి తిరుపతికి వెళ్లే భక్తుల కోసం ఒక భవన సముదాయం నిర్మించాలని ఈ మూడు బాధ్యతలు తనపై ఉన్నాయన్నారు. మహాసభ అభివృద్ధి, ఆస్తుల కోసం పనిచేయవలసిన అవసరం మన కమిటీ అందరిపై ఉందని దానిని గుర్తుంచుకొని అందరూ కలిసికట్టుగా పనిచేయాలని ఆయన కోరారు.ఆ విధంగా పనిచేస్తే మన కమిటీ ద్వారా రాష్ట్రంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఆర్యవైశ్యుల ఐక్యత,
సేవా భావాన్ని, సామాజిక సృహను తెలంగాణ సమాజానికి చాటి చెప్పొచ్చని తెలియజేశారు.ఈ సందర్భంగా అమరవాది లక్ష్మీనారాయణ తెలంగాణ వ్యాప్తంగా ఉన్న పేద ఆర్యవైశ్యు విద్యార్థులకు ఉపకార వేతనాలు అందజేస్తామని తెలియజేశారు.




