04-07-2025 12:00:00 AM
38 రోజుల పాటు మంచులింగం దర్శనం
న్యూఢిల్లీ, జూలై 3: ప్రతిష్ఠాత్మక అమర్‌నాథ్ యాత్ర గురువారం ప్రారంభమైంది. భారీ భద్రత నడుమ జమ్మూ బేస్ క్యాంప్ నుంచి అమర్‌నాథ్ యాత్రకు మొదటి బ్యాచ్ యాత్రికులు బయల్దేరారు. అంతకుముందు జమ్మూకశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా .. భగవతినగర్ యాత్రి నివాస్‌లో పూజలు నిర్వహించి జెండా ఊపి యాత్రను ప్రారంభించారు.
హిమాలయ పర్వతాల్లో సముద్ర మట్టానికి 3,888 మీటర్ల ఎత్తులో గల పవిత్ర గుహలోని మంచులింగం దర్శనార్థం దేశ నలుమూలల నుంచి భక్తులు వేలాదిగా తరలిరానున్నారు. ఈ ఏడాది యాత్ర జూలై 2న ప్రారంభమై ఆగస్టు 9న శ్రావణ పౌర్ణమి రోజున ముగియనుంది. గత ఏప్రిల్‌లో పహల్గాం ఉగ్రదాడి నేపథ్యంలో అమర్‌నాథ్ యాత్రకు అధికారులు అత్యంత కట్టుదిట్టమైన భద్రత ఏర్పాటు చేశారు.