05-07-2025 05:40:50 PM
జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి..
నల్లగొండ టౌన్ (విజయక్రాంతి): విపత్తుల నిర్వహణకు నల్గొండ జిల్లా యంత్రాంగం ఎల్లప్పుడూ సంసిద్ధంగా ఉంటుందని జిల్లా కలెక్టర్ ఇలా త్రిపాఠి(District Collector Ila Tripathi) జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారులకు తెలిపారు. శనివారం జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ అధికారుల బృందం జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాష్, అండర్ సెక్రెటరీ అభిషేక్ బీస్వాల్, వసీం ఇక్బాల్ ల బృందం రాష్ట్ర విపత్తుల నిర్వహణ అధికారి గౌతమ్ ఆధ్వర్యంలో ఒక రోజు నల్గొండ జిల్లా పర్యటనలో భాగంగా జిల్లా కలెక్టర్ ను జిల్లా కలెక్టర్ చాంబర్లో మర్యాదపూర్వకంగా కలిశారు. జాతీయ స్థాయిలో విపత్తుల నిర్వహణ అథారిటీ ఉన్నట్లుగానే జిల్లా స్థాయిలో జిల్లా విపత్తుల నిర్వహణ అథారిటీని ఏర్పాటు చేశామని, ఇందులో అన్ని శాఖల అధికారులను భాగస్వామ్యం చేసినట్లు కలెక్టర్ వెల్లడించారు.
వివిధ సందర్భాలలో వచ్చే విపత్తులను ఎదుర్కొనేందుకు జిల్లా యంత్రాంగాన్ని సంసిద్ధం చేయడం జరిగిందని, ప్రత్యేకించి వడదెబ్బ, వరదలు, తుఫానులు, ప్రమాదాలు, తదితర సమయాలలో తీసుకోవాల్సిన చర్యలపై ఇదివరకే సమావేశాలు నిర్వహించినట్లు ఆమె వెల్లడించారు. నల్గొండ జిల్లా తుఫాను, వరదలు, తదితర ప్రకృతి వైపరీత్యాల పరిధిలో లేనప్పటికీ ఒకవేళ విపత్తులు సంభవిస్తే ఆయా సమయాల్లో ఎలా స్పందించాలో ప్రణాళిక ఉన్నట్లు చెప్పారు.
జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ పవర్(District SP Sharat Chandra Pawar Power) మాట్లాడుతూ... పోలీస్ తరఫున జిల్లాలో 12వ పోలీస్ బెటాలియన్ ఉందని, ఒక కంపెనీ దళాలు (సుమారు 80 నుండి 100 మంది)కి విపత్తు నిర్వహణపై శిక్షణ ఇచ్చినట్లు తెలిపారు. ఈ సందర్భంగా జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ జాయింట్ అడ్వైజర్ నావెల్ ప్రకాష్ మాట్లాడుతూ... జాతీయ విపత్తుల నిర్వహణ అథారిటీ కింద 2021లో ఆపదమిత్ర వలంటీర్ల వ్యవస్థను ఏర్పాటు చేయడం జరిగిందని, అన్ని జిల్లాలలో ఆపదమిత్రలను ఏర్పాటు చేస్తున్నామని, అంతేకాక విపత్తుల సమయంలో అవసరమైన రిసోర్సెస్ ఏర్పాటు చేస్తున్నామని, ఆపద మిత్రుల శిక్షణ, విపత్తుల్లో వారు తీసుకోబోయే చర్యలపై అవసరమైన సహాయం అందజేస్తున్నట్లు వెల్లడించారు. రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్, సబ్ కలెక్టర్ నారాయణ అమిత్, ఆర్ డి ఓ వై.అశోక్ రెడ్డి, డిఆర్డిఓ శేఖర్ రెడ్డి, తదితరులు ఉన్నారు.