calender_icon.png 2 October, 2025 | 3:02 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అమెరికా షట్‌డౌన్

02-10-2025 12:28:30 AM

ఆరేళ్ల తర్వాత ఇదే తొలిసారి

వాషింగ్టన్, అక్టోబర్ 1: రెండు కీలకమైన బిల్లులకు ఆమోదం లభించకపోవడంతో అమెరికా షట్‌డౌన్‌లోకి వెళ్లింది. భారత కాలమానం ప్రకారం.. బుధవారం ఉద యం 9.30 గంటలకు ప్రక్రియ ప్రారంభమైంది. సెనెట్ గడువుకు ముందే స్టాపేజ్ బిల్లులను ఆమోదించకపోవడంతోనే ఈ పరిస్థితి తలెత్తింది. అధికార పార్టీ రిపబ్లికన్లు రెండు తాత్కాలిక నిధుల బిల్లును ప్రవేశపెట్టగా, డెమోక్రాట్లు ప్రధానంగా ఆరోగ్య బీమాపై రాయితీల పొడిగింపును కోరారు.

ఆ డిమాండ్‌పై ఆరోగ్య బీమా అంశాన్ని బడ్జెట్ చర్చల నుంచి వేరుగా చర్చించాలని రిపబ్లికన్లు సూచించారు. డెమోక్రాట్లు అందుకు సమ్మతించకుండా బిల్లులను అడ్డుకున్నారు. దీంతో బిల్లులకు ఆమోదం లభించలేదు. ఫలితంగా షట్‌డౌన్ జరిగింది. దీంతో దేశవ్యాప్తంగా అత్యవసర సేవలు మినహా ఇతర కార్యకలాపాలన్నీ నిలిచిపోనున్నాయి. షట్‌డౌన్ ప్రభావం దేశవ్యాప్తం గా పనిచేస్తున్న 7.5 లక్షల మంది తాత్కాలిక ఉద్యోగులపై పడుతుంది.

వీరికి షట్‌డౌన్ పరిస్థితి నుంచి ప్రభుత్వం బయటపడిన తర్వాతే వేతన చెల్లింపులుంటాయి. కొన్ని రకాల కాంట్రాక్ట్ ఉద్యోగాలకైతే అసలు ఎలాంటి హామీలు ఉండవని నిపుణులు తెలుపుతున్నారు. మిలటరీ, ఎయిర్ ట్రాఫి క్, వైద్యరంగాల్లో ఉన్నవారికి మాత్రం మినహాయింపు ఉంటుందని వెల్లడిస్తున్నారు. షట్‌డౌన్ వల్ల దేశ ఆర్థిక వ్యవస్థపై ఇప్పటికప్పుడు ప్రభావం పడకపోయినా, దీర్ఘకాలం కొనసాగితే ఆర్థిక వృద్ధి మందగించే పరిస్థితులు వస్తాయి. మార్కెట్లపై గణనీయమైన ప్రభావం చూపే అవకాశం ఉంది. 

షట్‌డౌన్ అంటే..

అమెరికా ప్రభుత్వ షట్‌డౌన్ అంటే ఫెడరల్ ప్రభుత్వానికి తాత్కాలికంగా నిధులు నిలిచిపోవడమని అర్థం. అమెరికాలో ఫెడరల్ ప్రభుత్వ కార్యకలాపాలకు నిధులు కేటాయించేందుకు అక్కడి పార్లమెంట్ (కాంగ్రెస్) ఏటా అక్టోబర్ 1న ఆర్థిక సంవత్సరానికి ముందే ‘బడ్జెట్ బిల్లులు’ లేదా ‘అప్రాప్రియేషన్ బిల్లులు’ ఆమోదించాల్సి ఉంటుంది. ఒకవేళ విధానపరమైన విభేదాలు లేదా రాజకీయ కారణాల వల్ల బిల్లులకు ఆమోదం రాకపోతే, ఇక ప్రభుత్వ వ్యయం నిలిచిపోతుంది.

జాతీయ భద్రత, సైనిక కార్యకలాపాలు, విమాన రాకపోకల నియంత్రణ, సోషల్ సెక్యూరిటీ, మెడికేర్ వంటి అత్యవసర సేవలు మాత్రం కొనసాగుతాయి. అయితే.. వీరు కూడా జీతం లేకుండా పనిచేయాల్సి ఉంటుంది. షట్‌డౌన్ అధిగమించాక ప్రభుత్వం వీరికి వేతనాలు చెల్లిస్తుంది. అత్యవసర సేవలు కాక మిగతా అన్ని ప్రభుత్వ విభాగాలు, సర్వీసులు నిలిచిపోతాయి.

జాతీయ పార్క్‌లు, మ్యూజియాలు, ఎన్నో ప్రభుత్వ కార్యాలయాలు మూతపడతాయి. పరిశోధన రంగాలకు గ్రాంట్లు నిలిచిపోతాయి. షట్‌డౌన్ ప్రభావం భారత మార్కెట్‌పైనా పడొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు. ముఖ్యంగా స్టాక్ మార్కెట్లు ఒడిదుడుకులకు లోనుకావొచ్చంటున్నారు. భారత్‌కు చెందిన వృత్తి నిపుణులు, వ్యాపారవేత్తలకు సంబంధించిన వీసా, ఇమ్మిగ్రేషన్ సేవలు ఆలస్యం కావొచ్చు.