అమిత్, జాస్మిన్ అదుర్స్
ఒలింపిక్స్ బెర్తు ఖరారు
బ్యాంకాక్: భారత యువ బాక్సర్లు అమిత్ పంగల్, జాస్మిన్ పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించారు. వరల్డ్ క్వాలిఫయింగ్ టోర్నీలో ఆదివారం ఈ ఇద్దరూ అదరగొట్టారు. పురుషుల 51 కేజీల క్వార్టర్ ఫైనల్లో ఆదివారం అమిత్ పంగల్ 5 చాన్ లియూ (చైనా)ను చిత్తుచేశాడు. తద్వారా ఈ టోర్నీలో పతకం ఖాయం చేసుకోవడంతో పాటు.. ప్రతిష్ఠాత్మక పారిస్ విశ్వక్రీడల బెర్తు దక్కించుకున్నాడు. గాయాల కారణంగా గత కొంతకాలంగా స్థాయికి తగ్గ ప్రదర్శన కనబర్చలేకపోతున్న అమిత్.. ఈ టోర్నీలో తన దమ్ముచూపాడు. కామన్వెల్త్ క్రీడల్లో స్వర్ణం సాధించిన అమిత్.. ఈ ఏడాది ఆరంభంలో జరిగిన స్ట్రాంజా మెమోరియల్ టోర్నీలోనూ విజేతగా నిలిచాడు. కీలక పోరులో ప్రత్యర్థి తన ఎత్తును సద్వినియోగ పర్చుకుంటూ పంగల్‌పై పంచ్‌ల వర్షం కురిపించగా.. తొలి రౌండ్‌లో కాస్త వెనుకబడ్డట్లు కనిపించిన అమిత్.. రెండో రౌండ్‌లో వ్యూహం మార్చి అటాకింగ్ గేమ్‌తో ప్రత్యర్థిపై విరుచుకుపడ్డాడు. ముఖ్యంగా జాబ్స్, అప్పర్ కట్స్‌తో చెలరేగిపోయాడు. ఇక మహిళల 57 కేజీల విభాగంలో పారిస్ టికెట్ సాధించిన పర్వీన్ హుడాపై సస్పెన్షన్ వేటు పడటంతో.. ఆమె స్థానంలో బరిలోకి దిగిన జాస్మిన్ తొలి ప్రయత్నంలోనే సత్తాచాటింది. ఆదివారం 57 కేజీల క్వార్టర్ ఫైనల్లో జాస్మిన్ 5 మారిన్ కామరాపై గెలుపొందింది. అనుకోని అవకాశాన్ని రెండు చేతులతో ఒడిసి పట్టిన జాస్మిన్.. తొలి ప్రయత్నంలోనే విశ్వక్రీడల్లో పాల్గొనే చా న్స్ దక్కించుకుంది. పురుషుల 57 కేజీల విభాగంలో సచిన్ సివాచ్ పరాజయం పాలయ్యా డు. తెలంగాణ స్టార్ బాక్సర్ నిఖత్ జరీన్ (50 కేజీలు), ప్రీతి, లవ్లీనా, నిషాంత్ ఇప్పటికే ఒలింపిక్ బెర్త్‌లు దక్కించుకున్నారు.






