ఉగ్రవాదుల ఏరివేతకు అదనపు బలగాలు: అమిత్ షా
న్యూఢిల్లీ: జమ్మూకశ్మీర్‌లో వరుస ఉగ్రదాడుల తర్వాత శాంతిభద్రతల పరిస్థితిని అంచనా వేయడానికి కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఆదివారం న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్షా సమావేశానికి అధ్యక్షత వహించారు. ఆరు గంటల పాటు సాగిన ఈ సమావేశం కాసేపటి క్రితమే ముగిసింది. ఈ భేటీలో కీలక నిర్ణయాలు తీసుకున్నారు. గతంలో కాశ్మీర్ లోయలో అమలు చేసిన విజయవంతమైన 'ఏరియా డామినేషన్ ప్లాన్' 'జీరో టెర్రర్ ప్లాన్'లను జమ్మూ డివిజన్‌లో పునరావృతం చేయాలని హోంమంత్రి భద్రతా సంస్థలను ఆదేశించారు. గత కొద్దిరోజులుగా కశ్మీర్ లో ఉగ్రవాదులు పెరిగిన నేపథ్యంలో కూంబింగ్ వేగవంతం చేయాలని సూచించారు.
జమ్మూ కాశ్మీర్‌లో ప్రస్తుతం ఉన్న భద్రతా పరిస్థితులపై హోంమంత్రికి సమగ్ర వివరణ ఇచ్చారు. మిషన్ మోడ్‌లో పని చేయాలని, సమన్వయ పద్ధతిలో త్వరిత ప్రతిస్పందనను నిర్ధారించాలని అమిత్ షా అన్ని భద్రతా ఏజెన్సీలను ఆదేశించారు. ఉగ్రవాదం అత్యంత వ్యవస్థీకృత తీవ్రవాద హింసాత్మక చర్యల నుండి కేవలం ప్రాక్సీ వార్‌గా కుదించబడిందని ఇటీవలి సంఘటనలు చూపిస్తున్నాయన్నారు. భద్రతా బలగాలు రానున్న రోజుల్లో ఈ ప్రాంతంలో తీవ్రవాద వ్యతిరేక కార్యకలాపాలను ముమ్మరం చేయాలని భావిస్తున్నట్లు తెలిపారు. అటు అమర్ నాథ్ యాత్ర జూన్ 29న ప్రారంభం కానుంది. ఈ ఏడాది దాదాపు 5 లక్షల మంది వరకు అమర్ నాథ్ యాత్రకు వెళ్లే అవకాశమున్నట్లు అంచనా వేశారు. అమర్ నాథ్ యాత్రకు గట్టిభద్రత కల్పించాలని ఆయన తెలిపారు. జమ్ముకాశ్మీర్ లో ఉగ్రవాదుల ఏరివేతకు అదనపు బలగాలు తరలించాలని ఆదేశించారు.
అమిత్ షా అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో జాతీయ భద్రతా సలహాదారు అజిత్ దోవల్, జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హా, ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ పాండే, ఆర్మీ చీఫ్‌గా నియమితులైన లెఫ్టినెంట్ జనరల్ ఉపేంద్ర ద్వివేది, కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా, డైరెక్టర్ ఇంటెలిజెన్స్ బ్యూరో తపన్ దేకా, సిఆర్ పిఎఫ్ డైరెక్టర్ జనరల్ అనిష్ దయాల్ సింగ్, బిఎస్ఎఫ్ డీజీ నితిన్ అగర్వాల్, జమ్మూ, కాశ్మీర్ పోలీస్ డైరెక్టర్ జనరల్ ఆర్ఆర్ స్వైన్, ఇతర ఉన్నత భద్రతా అధికారులు పాల్గొన్నారు.






