17 August, 2026 | 5:06 PM

గచ్చిబౌలిలో కంపెనీ ఎండీ, సేల్స్ కోఆర్డినేటర్ కిడ్నాప్

16-06-2024 04:47 PM

హైదరాబాద్: గచ్చిబౌలి పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు వ్యక్తుల కిడ్నాప్ కలకలం రేగింది. ఓ కంపెనీ ఎండీ, సేల్స్ కోఆర్డినేటర్ ను దుండగులు ఎత్తుకెళ్లారు. శుక్రవారం రాత్రి 8 గంటలకు సాయిగుప్తా, మరో వ్యక్తి కిడ్నాప్ అయ్యారు. ఎస్ వోటీ పోలీసులుగా చెప్పుకొని ఇద్దరిని కారులో జగద్గిరిగుట్టలో నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లారు. అక్కడ ఇద్దరిపై దుండగులు దాడి చేశారు. తర్వాత ఇద్దరికి వికారాబాద్ అడవుల్లోకి తీసుకెళ్లారు. ఇద్దరిని కొట్టి ఖాళీ బాండ్ పేపర్లపై సంతకాలు చేయించినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు వెతుకుతున్నారని తెలిసి వికారాబాద్ లో వదిలి పరారయ్యారు. సాయిగుప్తా, మరో ఉద్యోగి వికారాబాద్ నుంచి నగరానికి చేరుకున్నారు. గౌతమ్ భవిరి శెట్టి అనే వ్యక్తి కిడ్నాప్ చేయించాడని సాయిగుప్తా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గతంలో గౌతమ్ భవిరి శెట్టి, సాయి గుప్తా కలిసి వ్యాపారం చేశామని, కొంతకాలంగా ఇద్దరి మధ్య ఆర్థిక లావాదేవీల విషయంలో గొడవలు జరిగాయని పేర్కొన్నారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కిడ్నాప్ కేసు నమోదు చేసుకున్న గచ్చిబౌలి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. కిడ్నాప్ వ్యవహారంలో 13 మంది ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. పూర్తి సమాచారం ఇంకా తెలియాల్సి ఉంది.