సమీకృత మార్కెట్ సముదాయానికి గ్రహణం?
- ఏళ్లు గడిచినా వినియోగం సున్నా..
మంత్రి హామీ నీటిమూటేనా ?
రోడ్లపైనే వ్యాపారాలు..ఇబ్బందుల్లో వినియోగదారులు
జహీరాబాద్, మార్చి 17 :జహీరాబాద్ లోని సమీకృత వ్యాపార నిమిత్తం నిర్మించిన కూరగాయలు, మాంసము దుకాణాల స ముదాయానికి గ్రహణం పట్టింది. ఈ భవ నం నిర్మించి ప్రారంభించుకొని ఏళ్ళు గడుస్తున్నా వినియోగంలోకి రాకపోవడంతో ప్రభుత్వం ఖర్చుపెట్టిన డబ్బులు వ్యర్థమవుతున్నాయి. ప్రతి సంవత్సరం దుకాణాల ద్వా రా వచ్చిన ఆదాయం మున్సిపాలిటీకి రావా ల్సి ఉండగా మున్సిపాలిటీ ఈ ఆదాయాన్ని కోల్పోతుంది.
ఈ సముదాయాన్ని అప్పటి బీఆర్‌ఎస్ ప్రభుత్వంలో రూ.11 కోట్ల వ్యయంతో నిర్మాణం పనులు చేపట్టారు. ఈ సముదాయాన్ని అతి తక్కువ కాలంలో కాంట్రాక్టర్ పనులను వేగవంతంగా పూర్తి చేయడంతో డిసెంబర్ 2022 లో ప్రారంభోత్సవం కూడా నిర్వహించారు. దీంట్లో సెల్లా ర్తో పాటు గ్రౌండ్ ఫ్లోర్, ఫస్ట్ ఫ్లోర్లలో దుకాణాల సముదాయాన్ని నిర్మించారు. సెల్లార్లో 84 స్టాళ్లను నిర్మించి అందులో మాంసము, కూరగాయలు, చేపలకు సంబంధించిన వ్యాపారం చేసుకునేందుకు వీలుగా నిర్మించారు. ఈ దుకాణాల సముదాయం విని యోగంలోకి రాకపోవడంతో నిరుపయోగంగా దర్శనమిస్తుంది.
రోడ్డుపైనే వ్యాపారం నిర్వహించడం వల్ల ఆ ప్రాంతమంతా ట్రాఫిక్ తో కిక్కిరిసి వ్యాపారులకు, ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడంతో 23, ఫిబ్రవరి 2024న మున్సిపల్ సమావేశంలో రాష్ట్ర మంత్రి దామోదర్ రాజనర్సింహ పా ల్గొన్నారు. ఈ సమావేశంలో దుకాణాల సముదాయం గురించి ప్రస్తావన రావడం తో మంత్రి సదరు కాంట్రాక్టర్ ను పిలిచి త్వరలోనే బిల్లులు విడుదల చేసేందుకు ప్రయత్నం చేస్తానని చెప్పారు. దీంతో అప్పటి కలెక్టర్ కు దుకాణాల సముదాయానికి సంబంధించిన తాళాలను అప్పగించా రు.
అయినప్పటికీ ఇప్పటివరకు కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతో మళ్లీ కథ ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందనంగా మారింది. ప్రస్తుతం నూతన మున్సిప ల్ కౌన్సిల్ కూడా ఏర్పడడంతో సమీకృత మార్కెట్ సముదాయాన్ని వినియోగంలోకి తీసుకువస్తారని ప్రజలు భావిస్తున్నారు. మంత్రి దామోదర రాజనర్సింహ ఇచ్చిన హామీ ప్రకారం కాంట్రాక్టర్కు డబ్బులు చెల్లించకపోవడంతోనే దుకాణాల సముదాయం అప్పగింత ప్రక్రియ ఆగిపోయిందని పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు.
ఏదేమైనప్పటికీ కోట్ల రూపాయలతో నిర్మించి నిరుపయోగంలోకి తెచ్చేందుకు ప్రజాప్రతినిధులు, అధికారులు కృషి చేయాలని జహీరాబాద్ పట్టణ ప్రజలు కోరుతున్నారు.




