25-01-2026 01:40:59 PM
కోదాడ: కోదాడ పట్టణ సీఐ శివశంకర్‌పై అనుచిత, అవమానకర వ్యాఖ్యలు చేసి గిరిజన, ఎస్సీ, ఎస్టీ వర్గాల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీసిన మాజీ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద తక్షణమే కేసు నమోదు చేయాలని డిమాండ్ చేస్తూ గిరిజనులు ఆదివారం కోదాడ పట్టణంలో ఉగ్ర నిరసన చేపట్టారు. ఎల్‌హెచ్‌పీఎస్, గిరిజన యువత నాయకుల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో, డీఎస్పీ శ్రీనివాస్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.
అనంతరం పట్టణంలోని రంగా థియేటర్ సమీపంలో బొల్లం మల్లయ్య యాదవ్ దిష్టిబొమ్మను దగ్ధం చేసి ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా నాయకులు మండిపడ్డారు.ప్రజల రక్షణ కోసం పనిచేసే పోలీస్ అధికారిపై, పైగా ఎస్సీ, ఎస్టీ వర్గాలను కించపరిచేలా వ్యాఖ్యలు చేయడం అత్యంత దారుణమని విమర్శించారు. ప్రజాస్వామ్య దేశంలో ఇటువంటి మాటలు మాట్లాడే వ్యక్తులు ప్రజా జీవితంలో ఉండే అర్హత కోల్పోయారని ఘాటు వ్యాఖ్యలు చేశారు.రాజకీయ హోదా ఉందని చట్టాన్ని తుంగలో తొక్కడం సహించబోమని స్పష్టం చేశారు.
బొల్లం మల్లయ్య యాదవ్‌పై వెంటనే అట్రాసిటీ కేసు నమోదు చేసి, కఠిన చర్యలు తీసుకోకపోతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాన్ని విస్తరిస్తామని హెచ్చరించారు. గిరిజనుల ఆత్మగౌరవంపై దాడి చేసిన ప్రతి ఒక్కరికి చట్టం గట్టి గుణపాఠం చెప్పాల్సిందేనని, పోలీస్ శాఖకు అండగా నిలుస్తామని నాయకులు స్పష్టం చేశారు.ఈ నిరసన కార్యక్రమంలో గిరిజన నాయకులు, యువజన సంఘాల ప్రతినిధులు, ఎల్‌హెచ్‌పీఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని నినాదాలతో కోదాడ పట్టణాన్ని హోరెత్తించారు.