25-01-2026 11:38:40 AM
- బెల్లంపల్లి విప్లవోద్యమ మరో ఆడబిడ్డ మావోయిస్టు బాలమల్లు లొంగుబాటు..
- 28 ఏళ్ళు అజ్ఞాతవాసంలో పుష్ప ..
- ఉద్యమంలో సహచడు వెంకటినీ కోల్పోయినా వైనం..
బెల్లంపల్లి,(విజయక్రాంతి): విప్లవోద్యమానికి పురిటి గడ్డ బెల్లంపల్లికి చెందిన మరో మహిళా మావోయిస్టు నేత ఉద్యమాన్ని వీడింది. గత సంవత్సరం బెల్లంపల్లికి చెందిన సలాకుల సరోజ ఆయుధాలతో కేంద్ర కమిటీ సభ్యుడు సోను బృందంతో లొంగిపోయిన విషయం తెలిసిందే. ఈ సంఘటన ఇంకా మరువక ముందే బెల్లంపల్లి మండలం చంద్రవెల్లికి చెందిన ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప లొంగిపోవడంతో మరోసారి మావోయిస్టు ఉద్యమానికి ఎదురు దెబ్బ తగిలింది. గత సంవత్సరం బాలమల్లు భర్త జాడి వెంకటి చతిస్గడ్ లో జరిగిన ఎన్కౌంటర్లు మృతి చెందిన విషయం తెలిసింది.
భార్యాభర్తలు జాడి వెంకటి, బాలమల్లు మావోయిస్టు దంపతులు సింగరేణి కార్మిక సమాఖ్య (సికాస) విప్లవద్యమానికి ఆకర్షితులై రెండు దశాబ్దాల క్రితం అడవి బాట పట్టారు. సుదీర్ఘ కాలం పాటు అజ్ఞాతంలో గడిపిన ఈ దంపతుల్లో జాడి వెంకటి పోలీస్ కాల్పుల్లో మృతి చెందారు. పుష్ప మాత్రం మొన్నటి వరకు విప్లవోద్యమంలోనే కొనసాగింది. భర్త వెంకటి మృతితో బాలమల్లు కలత చెంది ఉద్యమం నుంచి బయటికి వచ్చినట్టు తెలుస్తుంది. మావోయిస్టు కీలక నేత ఆవుల బాలమల్లు అలియాస్ పుష్ప ఛత్తీస్‌గఢ్‌లోని ధమ్తారి జిల్లాలో రెండు రోజుల క్రితం తొమ్మిది మంది మావోయిస్టులతో కలిసి ఆయుధాలతో లొంగిపోయింది.
రాయ్‌పూర్ రేంజ్ ఐజీ అమ్రేష్ మిశ్రా ఎదుట లొంగిపోయారు. బెల్లంపల్లి మండలం చంద్రవేల్లికిగ్రామానికి చెందిన బాలమల్లు, తన భర్త జాడి వెంకటి అలియాస్ సురేష్‌తో కలిసి 28 ఏళ్ల క్రితమే అజ్ఞాతంలోకి వెళ్లారు. గత ఏడాది సెప్టెంబర్‌లో ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని గరియాబంద్ అటవీ ప్రాంతంలో జరిగిన ఎన్‌కౌంటర్‌లో జాడి వెంకటి మృతి చెందినది తెలిసింది. జాడి వెంకటి మృతి అనంతరం పుష్పా తల్లి ఆవుల పోశమ్మ, సోదరులు లొంగిపోయి ఇంటికి రావాలని కోరారు. మీడియా వేదికగా కన్నీటి తో ఆమెకు విజ్ఞప్తి చేశారు.
భర్త జాడి వెంకటి మృతి చెందిన నాలుగు నెలల తర్వాత మావోయిస్టు నేత బాలమల్లు అలియాస్ పుష్ప అడవి ఉద్యమాన్ని వీడింది. ఇంతకాలం మావోయిస్టు నేత బాలమల్లు ఒడిశా మావోయిస్టు కమిటీలోని ధమ్తారి-గరియాబంద్-నువాపాడ డివిజన్ పరిధిలోని నాగరి, సితానది ఏరియా కమిటీ, పరిధిలో తన కార్యకలాపాలు సాగించారు. డీవిసిఎం స్థాయికి ఎదిగిన ఆవుల బాలమల్లు పై అక్కడి ప్రభుత్వం రూ.8 లక్షల రివార్డు ప్రకటించింది. బాలమల్లు అలియాస్ పుష్ప లొంగుబాటుతో విప్లవోద్యమంలో బెల్లంపల్లి కి చెందిన విప్లవకారుల పాత్ర ఇక లేకుండా పోయిందని పోలీసులు భావిస్తున్నారు.