25-01-2026 01:32:33 PM
హైదరాబాద్: సింగరేణి టెండర్లపై బీఆర్ఎస్ మాజీ మంత్రి, ఎమ్మెల్యే హరీష్ రావు తెలంగాణ భవన్ లో సమావేశం నిర్వహించారు. సింగరేణి టెండర్ల విషయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అవినీతి చేస్తున్నారంటూ ప్రతిపక్షలు ఆరోపిస్తుంటే ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క దాని గుర్తుంచి ఆయనతో మాట్లాడతానంటున్నారని ఎద్దేవా చేశారు. అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పకుండా భట్టి దాటవేశారని, 40 ఏళ్ల అనుభవాన్ని ఉపయోగించి సీఎంను బొగ్గు స్కామ్ నుంచి బయటపడేసేందుకే ఆయన ప్రయత్నిస్తున్నారని హరీష్ రావు ఆరోపించారు.
సైట్ విజిట్ సర్టిఫికెట్ పై డిప్యూటీ సీఎం అవాస్తవాలు మాట్లాడుతున్నారని, బొగ్గు కుంభకోణం బయటపెట్టిన బీఆర్ఎస్ పై బురదజల్లతున్నారు. 2025 మేలో సైట్ సర్టిఫికెట్ నిబంధన వచ్చిందని, ఆ సర్టిఫికెట్ నిబంధన తొలి లబ్ధిదారు శోధా కన్ స్ట్రక్షన్స్ యజమాని సృజన్ రెడ్డి అని, ఆయన ముఖ్యమంత్రి బంధువు అని పేర్కొన్నారు. ఆ తర్వాత అన్ని టెండర్లకు సైట్ సర్టిఫికెట్ నిబంధన పెట్టారని, ప్రతి టెండర్ ప్లస్ టెన్ పద్ధతి ఫాలో అయ్యారు. బొగ్గు గనిలో స్కామ్ లు జరగలేదని నమ్మించేందుకు భట్టి విక్రమార్క ప్రయత్నిస్తున్నారని ఆయన తెలిపారు.
నైనీ కోల్ బ్లాక్ ఒక్కటే కాదు... సైట్ విజట్ విధానం పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని, పారదర్శకత, నిజాయితీ ఉంటే సైట్ విజట్ పెట్టిన అన్ని టెండర్లు రద్దు చేయాలని హరీష్ రావు డిమాండ్ చేశారు. 2025 మే నుంచి ఎన్ని టెండర్లు పిలిచారో, ఎంత మందికి సైట్ సర్టిఫికెట్ ఇచ్చారో శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని అనేక మంది ఫిర్యాదు చేశారని, తమకు కావాల్సిన వారికే సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇచ్చారని ఆయన చెప్పారు.
కొంతమంది సైట్ విజిట్ చేసి సెల్పీలు తీసుకుని మరీ సింగరేణికి మెయిల్ చేశారని, తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని జీసీసీ, మహాలక్ష్మి వంటి కంపెనీలు మెయిల్స్ చేశాయని బీఆర్ఎస్ మాజీ మంత్రి తెలిపారు. తమకు సైట్ విజిట్ సర్టిఫికెట్లు ఇవ్వట్లేదని మీకు మెయిల్స్ రాలేదా..?, తన వద్ద అన్ని ఆధారాలు, ఫోటోలు, మెయిల్స్, వీడియోలు ఉన్నాయని, విచారణకు ఆదేశించండి.. నా వద్ద ఉన్న ఆధారాలు ఇస్తా.. అని హరీష్ వ్యాఖ్యానించారు. సమయం వచ్చినప్పుడు అన్ని ఆధారాలు బయటపెడతా అని, టెండర్లు నిబంధనలు మార్చేటప్పుడు కాంట్రాక్టర్లతో సమావేశం పెడతారని, అలాగే టెండర్ల రింగ్ మాస్టరైన సీఎం బంధువు ఏ హోటల్ లో మీటింగ్ పెట్టాడో కూడా నాకు తెలుసాన్నారు.