03-02-2026 02:35:22 AM
కామారెడ్డి పట్టణ పోలీసులు మెరుపు దర్యాప్తు రెండు రోజులలో నేరస్తుడి అరెస్ట్
ఎస్పి యం రాజేష్ చంద్ర
కామారెడ్డి, ఫిబ్రవరి 02 (విజయక్రాంతి):సహాయం చేస్తానని నమ్మించి, ఓ వృద్ధురాలిని మత్తులోకి దించి ఆమె మెడలోని బంగారు ఆభరణాన్ని అపహరించిన కేసులో నిందితుడిని కామారెడ్డి పట్టణ పోలీసులు సోమవారం అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర తెలిపారు. నిందితుడి వద్ద నుండి చోరీకి గురైన రూ. 25,000 విలువైన ఒక తులం బంగారు గుండ్లను (మంగళసూత్ర పూసలు) స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.
కామారెడ్డి పట్టణంలోని భరత్ రోడ్కు చెందిన బట్టు నర్సవ్వ (60) అనే వృద్ధురాలు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తోంది. గత నెల 30వ తేదీన మధ్యాహ్నం సమయంలో ఆమె భూపుత్రమ్మ కళ్యాణ మండపం సమీపంలోని కల్లు దుకాణం వద్ద ఉండగా, నిందితుడు రత్లా రవి (35) ఆమెతో మాటలు కలిపాడు. ఆమె సరిగా నడవలేని స్థితిలో ఉండటాన్ని గమనించిన నిందితుడు, తానే స్వయంగా ఇంటి వద్ద దింపుతానని తన మోటారు సైక్పి నమ్మించి తీసుకెళ్లాడు.
ఇంటికి వెళ్ళిన తర్వాత ఆమెకు మళ్ళీ కల్లు తాగించి, ఆమె మత్తులోకి వెళ్ళగానే మెడలోని ఒక తులం బంగారు గుండ్లను బలవంతంగా లాక్కొని, ఆమెను కిందకు తోసివేసి పరారయ్యాడు. మరుసటి రోజు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కామారెడ్డి పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగించి నిందితుడు రవి గా గుర్తించి అతడు తాను లాక్కెళ్లిన బంగారం సొత్తును అమ్మడానికి తీసుక వెళ్ళుతుండగా సుబాష్ రోడ్డులో పట్టుకొని అరెస్ట్ చేయడం జరిగిందన్నారు.
కామారెడ్డి జిల్లా గాంధారి మండలం జెమినీ తండా చెందిన రత్లా రవి గా గుర్తించినట్లు తెలిపారు. ఎవరైనా అపరిచితులు మాట కలిపి సహాయం చేస్తామంటే నమ్మి వారి వాహనాలపై వెళ్ల వద్దన్నారు. మద్యం లేదా ఇతర మత్తు పదార్థాల ప్రభావంలో ఉన్నప్పుడు మరింత అప్రమత్తంగా ఉండాలన్నారు. ముఖ్యంగా వృద్ధులు, ఒంటరి మహిళలు బయటకు వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు.
ఏదైనా అనుమానాస్పద వ్యక్తి లేదా సంఘటన కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా స్థానిక పోలీస్ స్టేషన్కు సమాచారం ఇవ్వాలన్నారు. కేసును అతి తక్కువ సమయంలో ఛేదించి నిందితుడిని పట్టుకోవడంలో చురుకైన పాత్ర పోషించిన ఏఎస్‌ఐ రంగారావు, పిసిలు కమలాకర్, రాజు, సంపత్లను కామారెడ్డి జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర ప్రత్యేకంగా అభినందించారు. ఈ సమావేశంలో ఏఎస్పి చైతన్య రెడ్డి, పట్టణ ఎస్ హెచ్ ఓ నరహరి, సిసిఎస్ సీఐ శ్రీనివాస్ కానిస్టేబుల్ పాల్గొన్నారు.