16-12-2025 05:56:23 PM
సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): 20 సంవత్సరాల క్రితం సోనియా గాంధీ యుపిఎ చైర్ పర్సన్ గా కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా గ్రామాలలోని పేదలకు భరోసా కల్పించడానికి మహాత్మాగాంధీ ఉపాధి హామీ పథకాన్ని ప్రవేశపెట్టడం జరిగిందని, కేంద్రంలో అధికారంలో ఉన్న ఎన్డీఎ ప్రభుత్వం ఈ పథకాన్ని నిర్వీర్యం చేయాలని చూస్తుందని సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి అన్నారు. మంగళవారం నగరంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాల్లోని పేద ప్రజలకు ఉపాధి దొరుకుతుందని అన్నారు.
గత పన్నెండు సంవత్సరాలుగా అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ ప్రభుత్వం ఎఒక్క పథకం తీసుకురాకపోగా మారిన సామాజిక ఆర్ధిక పరిస్థితులకు అనుగుణంగా మార్పులు చేస్తున్నామని పార్లమెంటులో నూతన బిల్లు ప్రవేశపెట్టిన ఎన్డీఎ ప్రభుత్వం అప్పటికి ఇప్పటికీ 20 శాతం నిత్యావసర వస్తువుల ధరలు పెరిగినప్పటికి కనీసం కూలీ రేటు పెంచాలన్న సోయి కూడా లేదని, పని దినాలు కేవలం 25 రోజులు మాత్రమే పెంచారని అన్నారు.
ఒక్కో రాష్ట్రానికి ఒక్కో రకంగా నిర్దిష్ట మొత్తాన్ని కేటాయిస్తామని పేర్కొనడం వెనుక బీజేపేతర రాష్ట్రాల ప్రభుత్వాలకు మొండి చేయి చూపే కుట్ర ఉందని ఆరోపించారు. మహాత్మాగాంధీ పేరు తొలగించడంలో ఉన్న శ్రద్ధ పేదలకు న్యాయం చేయాలన్న దాంట్లో లేదని విమర్శించారు. తెలంగాణలోని కేంద్ర మంత్రులు, బీజేపీ ఎంపిలు ప్రజలకు సమాధానం చెప్పాలని నరేందర్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో పిట్టల రవీందర్, గుండాటి శ్రీనివాస్ రెడ్డి, కుర్ర పోచయ్య, దండి రవీందర్, మేకల నర్సయ్య, రమణా రెడ్డి, సుదర్శన్, మేరాజ్, మాసుం ఖాన్, తోట అంజయ్య, బషీర్, పెద్దిగారి తిరుపతి, కొట్టె ప్రభాకర్, అష్రఫ్, బత్తుల రాజ్ కుమార్, బషీర్, భారీ, సాయిరాం, ఉప్పరి అజయ్, యోనా, తదితరులు పాల్గొన్నారు.