16-12-2025 06:12:18 PM
పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం
కరీంనగర్ క్రైం (విజయక్రాంతి): కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో 17న జరగనున్న మూడవ దశ గ్రామ పంచాయతీ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో, నిష్పక్షపాతంగా నిర్వహించడానికి పటిష్ట భద్రతా చర్యలు చేపట్టినట్లు పోలీస్ కమిషనర్ గౌస్ ఆలం తెలిపారు. ఎన్నికల్లో పాల్గొనే సిబ్బందితో మంగళవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కరీంనగర్ కమిషనరేట్ పరిధిలోని వీణవంక, ఇల్లందకుంట, జమ్మికుంట, హుజురాబాద్, వి. సైదాపూర్ మండలాల పరిధిలో 111 గ్రామ పంచాయతీల్లో 1034 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రతీ మండలానికి ఒక ఏసీపీ అధికారిని కేటాయించామని, క్రిటికల్ పోలింగ్ కేంద్రాలు, ఎక్కువ పోలింగ్ కేంద్రాలు గల మండలాలలో ఇద్దరు ఏసీపీలను కేటాయించామని తెలిపారు. గత సంఘటనల ఆధారంగా గుర్తించిన సున్నితమైన పోలింగ్ కేంద్రాల వద్ద అదనపు బలగాలను మోహరించడంతో పాటు, వెబ్ కాస్టింగ్ లేదా మైక్రో అబ్జర్వర్లను ఏర్పాటు చేశామని తెలిపారు. ప్రతి పోలింగ్ స్టేషన్లో స్టాటిక్ పోలీసు పార్టీ, ప్రతి మార్గంలో రూట్ మొబైల్ పార్టీ ఉండేలా చర్యలు తీసుకున్నామన్నారు. పోలింగ్ కేంద్రాల పరిసరాల్లో 100 మీటర్ల వరకు ప్రచారం, పార్టీ చిహ్నాలు, గుంపులుగా ఉండడం పూర్తిగా నిషేధమని తెలిపారు. ఎన్నికల బందోబస్తు కోసం దాదాపు 877 మంది పోలీసు సిబ్బందిని వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు.
ఇందులో ఆరుగురు ఏసీపీలు, 20 మంది ఇన్స్పెక్టర్లు, 39 మంది ఎస్సైలు, 40 మంది ఏఎస్సై, హెడ్ కానిస్టేబుల్స్, 460 మంది కానిస్టేబుళ్ళు, 35 మంది స్పెషల్ యాక్షన్ టీమ్ పోలీసులు, 178 మంది హోంగార్డ్స్, 100 మంది బెటాలియన్ స్పెషల్ పోలీసులతో పాటుగా అదనంగా ఈ విడతలో ఎన్.సీ.సీ. సభ్యులను కూడా వినియోగిస్తున్నట్లు సీపీ తెలిపారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం భారతీయ నాగరిక్ సురక్ష సంహితలోని సెక్షన్ 163 కింద నిషేధాజ్ఞలను విధిస్తూ ఉత్తర్వులు జారీ చేశామని తెలిపారు. ఎన్నికల అనంతరం అదేరోజు ఎలాంటి విజయోత్సవ ర్యాలీలు నిర్వహించడం పూర్తిగా నిషేధమని స్పష్టం చేశారు. ఎన్నికలు ప్రశాంతంగా, విజయవంతంగా ముగిసేందుకు ప్రజలు, రాజకీయ పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు పూర్తిగా సహకరించాలని సీపీ విజ్ఞప్తి చేశారు.