అనకాపల్లికి పెద్ద విజయం దక్కాలి
భవ్యశ్రీ మూవీ మేకర్స్, నక్కిన నెరేటివ్స్ బ్యానర్లపై కాండ్రేగుల నాయుడు, త్రినాథరావు నక్కిన నిర్మించిన చిత్రం ‘అనకాపల్లి’. ఈ మూవీలో విక్రమ్ సహిదేవ్, సంధ్యా వశిష్ట, తారక్ పొన్నప్ప ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ సినిమాకి ఖగేశ్ తమ్మినేని దర్శకత్వం వహించారు. ఈ చిత్రానికి కథ, స్క్రీన్‌ప్లేని అందించడమే కాకుండా త్రినాథరావు నక్కిన ఓ ముఖ్యపాత్రను కూడా పోషించారు. ఈ సినిమాని త్వరలోనే రిలీజ్ చేయబోతున్నారు.
ఈ నేపథ్యంలో మూవీ టీమ్ అనకాపల్లిలో నిర్వహించిన ప్రీరిలీజ్ ఈవెంట్‌కు బాలీవుడ్ నటుడు సోనూ సూద్ ముఖ్యఅతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా సోనూ సూద్ మాట్లాడుతూ.. “అనకాపల్లి’ మూవీని ప్రేక్షకులు థియేటర్లలో చూసి పెద్ద విజయాన్ని అందించాలని కోరుకుంటున్నా” అన్నారు. ‘మా సినిమాని థియేటర్లో చూసి ఎంజాయ్ చేస్తారని ఆశిస్తున్నాన’ని విక్రమ్ సహిదేవ్ అన్నారు. ‘మా చిత్రంలో అందమైన ప్రేమ కథతోపాటు ఫ్యామిలీ డ్రామా ఉంటుంది’ అని సంధ్యా వశిష్ట చెప్పింది.
త్రినాథరావు నక్కిన మాట్లాడుతూ.. “అనకాపల్లిలో నాటకాలు వేయాలని చదువుకునే టైమ్‌లో అనుకున్నా, కుదర్లేదు. ఇప్పుడు నేను నటించి, నిర్మించిన సినిమా ఈవెంట్ ఇక్కడ చేస్తున్నందుకు సంతోషంగా ఉంది. అనకాపల్లి ప్రజలంతా ‘అనకాపల్లి’ సినిమా చూడండి” అన్నారు. ‘అనకాపల్లి టైటిల్ పెట్టినందుకు ఊరంతా నాకు సపోర్ట్ చేసింది’ అని నిర్మాత నాయుడు కాండ్రేగుల తెలిపారు. దాడి జగన్ ప్రభాకర్, లగడపాటి శ్రీధర్ కూడా మాట్లాడారు.






