calender_icon.png 2 November, 2025 | 6:28 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఇక సత్యనాశ్..

28-10-2025 12:00:00 AM

రవితేజ, శ్రీలీల జంటగా నటిస్తున్న చిత్రం ‘మాస్ జాతర’. తెలుగులో ఎన్నో విజయవంతమైన చిత్రాలకు రచయితగా పనిచేసిన భాను భోగవరపు ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ పతాకాలపై సూర్యదేవర నాగవంశీ, సాయిసౌజన్య నిర్మిస్తున్న ఈ చిత్రం అక్టోబర్ 31న థియేటర్లలోకి రానుంది. ఈ నేపథ్యంలో మేకర్స్ ఈ సినిమా ట్రైలర్‌ను సోమవారం విడుదల చేశారు. ఇందులో రైల్వేపోలీస్ అధికారిగా రవితేజ.. భారీ యాక్షన్ సన్నివేశాలు, పంచ్ డైలాగ్‌లతో ఆకట్టుకున్నారు.

ముఖ్యంగా ‘ఇన్నా ళ్లూ నువ్వు నా లిమిట్‌లోకి రాక నీ దందా నడిచింది. ఇక నుండి సత్యనాశ్’, ‘నేను రైల్వే పోలీస్ కాద్.. క్రిమినల్ పోలీస్’, ‘రైల్వేలో ఈస్ట్ జోన్, వెస్ట్ జోన్, నార్త్ జోన్, సౌత్ జోన్‌లుంటాయ్.. నేను వొచ్చినాక ఒక్కటే జోన్.. వార్ జోన్’ వంటి మాస్ మహారాజ చెప్పిన డైలాగులు ఆకట్టుకుంటున్నాయి. మొత్తంగా వింటేజ్ రవితేజను గుర్తు చేస్తూ, మాస్ విందుకు హామీ ఇచ్చేలా ఉందీ ట్రైలర్.

నవీన్‌చంద్ర మరోసారి ప్రతినాయక పాత్రలో కనిపించారు. శ్రీలీల పల్లెటూరి అమ్మాయిగా అందంగా కనిపించారు. ముఖ్యంగా ఆమె తొలిసారి శ్రీకాకుళం యాసలో డైలాగులు చెప్పి ఆశ్చర్యపరిచింది. ఈ చిత్రానికి సంగీతం: భీమ్స్ సిసిరోలియో; ఛాయాగ్రహణం: విధు అయ్యన్న; మాటలు: నందు సవిరిగాన; కూర్పు: నవీన్ నూలి; కళా దర్శకత్వం: శ్రీనాగేంద్ర తంగాల.