calender_icon.png 27 October, 2025 | 1:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

తరుముకొస్తున్న'మొంథా' తుపాన్

27-10-2025 10:32:01 AM


అమరావతి: తీవ్రమైన మొంథా తుఫాను(Cyclonic Storm Montha) తీరాన్ని తాకనున్న నేపథ్యంలో భారత వాతావరణ శాఖ (India Meteorological Department) సోమవారం ఆంధ్రప్రదేశ్‌లోని ఏడు జిల్లాలైన కాకినాడ, కోనసీమ, పశ్చిమ గోదావరి, కృష్ణ, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు జిల్లాల్లో రెడ్ అలర్ట్ జారీ(Red alert issued) చేసింది. ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన 'మొంథా' తుపాను ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh) పైకి దూసుకొస్తుంది. నైరుతి, పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో మొంథా తుపాను ఏర్పడింది.  మొంథా తుపాన్ గడిచిన 6 గంటల్లో గంటకు 16 కిలో మీటర్ల వేగంతో కదిలింది. ప్రస్తుతానికి కాకినాడకు దక్షిణ ఆగ్నేయంగా 610 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయి ఉంది. తుపాన్ విశాఖకు దక్షిణ ఆగ్నేయంగా 650 కిలో మీటర్లు దూరంలో ఉంది. చెన్నైకు తూర్పు ఆగ్నేయంగా 590 కిలో మీటర్ల దూరంలో తుపాను ఉంది.

పోర్టుబ్లెయిర్ కు పశ్చిమంగా 750 కిలోమీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతం అయింది. పశ్చిమ వాయవ్యంగా కదిలి 12 గంటల్లో తీవ్ర తుపానుగా మారే అవకాశముంది. తుపాను దగ్గరకు వచ్చేకొద్ది తీవ్ర ప్రభావం చూపే అవకాశముందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో రేపు సాయంత్రం లేదా రేపు రాత్రికి తీవ్రతుపానుగా తీరం దాటే అవకాశముంది. మచిలీపట్నం- కళింగపట్నం మధ్య కాకినాడ తీరం దాటే అవకాశముంది. తీరం దాటే సమయంలో గంటలకు 90 నుంచి 110 కిలో మీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు  వీయనున్నాయి.

మొంథా తుపాను నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం(Government of Andhra Pradesh) అప్రమత్తం అయింది. తుపాను సహాయ చర్యల కోసం ప్రభుత్వం రూ.19 కోట్లను విడుదల చేసింది. ఎస్డీఆర్ఎఫ్, ఏపీఎస్‌డీఎంఏ కేంద్రాలు, 16 శాటిలైట్ ఫోన్లు ఏర్పాటు చేశారు. 57 తీర ప్రాంత మండలాల పరిధిలో 219 తుపాను షెల్టర్లు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు. సముద్రంలో 62 మెకనైజ్డ్ బోట్లను ఒడ్డుకు రప్పించేందుకు చర్యలు చేపట్టారు. ఇప్పటికే సముద్ర తీరాల్లో పర్యాటకుల రాకపోకలపై నిషేధం విధించారు. తుపాను దృష్ట్యా అధికారుల సెలవులు రద్దు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అనకాపల్లి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరులో విద్యాసంస్థలకు ఎల్లుండి వరకు, ప.గో, ఏలూరు, బాపట్ల, కడపలో విద్యాసంస్థలకు రేపటి వరకు సెలవులు ఇచ్చారు. కాకినాడ జిల్లాలో 269 పునరావాస కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు అధికారులు పేర్కొన్నారు.