calender_icon.png 27 October, 2025 | 3:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

జూబ్లీహిల్స్‌లో ప్రధాన పోటీ బీజేపీ-మజ్లిస్ మధ్యే

27-10-2025 01:04:54 PM

హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నిక(Jubilee Hills by-election) దగ్గర పడుతున్న కొద్దీ ప్రధాన పార్టీల నాయకులు ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకుంటూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నారు. అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ జూబ్లీహిల్స్ నియోజకవర్గాన్ని సొంతం చేసుకోవాలని శాయశక్తులా ప్రయత్నిస్తుండగా, భారతీయ జనతా పార్టీ వరుస సమావేశాలు, ప్రచారాలతో దూసుకుపోతూ బీఆర్ఎస్, కాంగ్రెస్ పై విమర్శలు సంధిస్తోంది. కాగా, జూబ్లీహిల్స్‌లో ప్రధాన పోటీ బీజేపీ-మజ్లిస్ మధ్యే జరుగుతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రామచందర్ రావు(N. Ramachandra Rao) స్పష్టం చేశారు.

సోమవారం నాడు రాష్ట్ర కార్యాలయంలో జూబ్లీహిల్స్ ఉపఎన్నికల ప్రచారంలో భాగంగా నిర్వహించిన శక్తి కేంద్ర ఇంచార్జిల సమావేశంలో రామచందర్ రావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజలు బీజేపీకి ఓటు వేయకపోతే, మజ్లిస్ సీట్లు సంఖ్య ఎనిమిదికి పెరిగే ప్రమాదం ఉందన్నారు. మజ్లిస్‌ను అడ్డుకోవాలంటే బీజేపీని గెలిపించాలిని ఆయన జూబ్లీహిల్స్ ఓటర్లను కోరారు. జూబ్లీహిల్స్ ప్రజల్లో బీజేపీని గెలిపించాలని ఉన్న ఆత్మీయ ఆలోచనకు ఇప్పుడు బలంగా పెరుగుతోందని తెలిపారు. జూబ్లీహిల్స్ ఉపఎన్నిక బీజేపీ విజయ యాత్రకు నాంది అవుతుందని రామచందర్ రావు సూచించారు. జూబ్లీహిల్స్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు చేసిందేమీ లేదని ఆయన  ఆరోపించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, శక్తి కేంద్ర ఇన్ ఛార్జ్ లు, చంద్రశేఖర్, గరికపాటి మోహన్ రావు, గౌతమ్ రావు, వేముల అశోక్, రాష్ట్రంలోని జిల్లా నాయకులు పాల్గొన్నారు.