calender_icon.png 19 September, 2025 | 9:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభిమానుల్లో ఆగ్రహం

14-09-2025 12:00:00 AM

క్రికెట్‌లో భారత్, పాకిస్థాన్ మధ్య మ్యాచ్‌కు ఎనలేని క్రేజ్ ఉంటుందన్న విషయం తెలిసిందే. ఈ రెండు దేశాల మధ్య ఎక్కడ మ్యాచ్ జరిగినా అభిమానులందరూ టీవీలకు అతుక్కుపోయేవాళ్లు. గతేడాది టీ20 ప్రపంచకప్ సందర్భంగా కూడా భారత్, పాక్ మధ్య జరిగిన పోరు అత్యధిక టీఆర్పీ సాధించిన మ్యాచ్‌గా చరిత్ర పుటల్లోకి ఎక్కింది. అయితే ఏడాది తిరిగేసరికి పరిస్థితులు పూర్తిగా మారిపోయాయి.

ఆసియాలో ‘మినీ ప్రపంచకప్’గా పిలవబడే ఆసియా కప్‌లో నేడు భారత్, పాకిస్థాన్ మ్యాచ్ జరగనుంది. అయితే ఈ మ్యాచ్‌ను వీక్షించేందుకు భారత అభిమానులు పెద్దగా ఆసక్తి చూపడం లేదని తెలుస్తోంది. చిరకాల ప్రత్యర్థుల మధ్య పోరు అంటే ఎప్పుడూ హాట్‌కేకుల్లా అమ్ముడుపోయే టికెట్లు ఈసారి మాత్రం భారీగా మిగిలిపోవడం గమనార్హం. అంతేకాదు మ్యాచ్‌కు ‘బాయ్‌కాట్’ నిరసన సెగ పెరిగిపోయింది.

పహల్గాం ఉగ్రదాడి ఘటన మరిచిపోలేమని.. ఆ దాడిలో ముష్కరులు చేసిన రక్తపాతం తమ కళ్ల ముందు ఇంకా కదలాడుతుందని, ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తున్న పాకిస్థాన్‌తో మ్యాచ్ ఆడడం ఏంటని అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా రు. ఈ ఏడాది ఏప్రిల్  నెలలో పహల్గాం ఉగ్రదాడి భారత్, పాక్ మధ్య మరోసారి నిప్పురవ్వను రగిల్చింది. పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీవోకే) నుంచి భారత్‌లోకి చొరబడిన ముష్కరులు కాల్పులకు తెగబడి 26 మంది అమాయక పౌరుల ప్రాణాలను పొట్టనబెట్టుకున్నారు.

పహల్గాం ఉగ్రదాడికి బదులుగా భారత ప్రభుత్వం ‘ఆపరేషన్ సిందూర్’ పేరుతో పాక్ గుండెల్లో రైళ్లు పరిగెత్తించి మోకరిల్లేలా చేసింది. అయితే పాక్‌తో మ్యాచ్‌ను బహిష్కరించాలని అభిమానులు సహా పలు రాజకీయ పార్టీలు కూడా పెద్ద ఎత్తున డిమాండ్ చేస్తున్నాయి. రాబోయే మహిళల వన్డే ప్రపంచకప్‌తో పాటు భవిష్యత్తులోనూ పాకిస్థాన్‌తో భారత్ ఎలాంటి మ్యాచ్‌లు ఆడకుండా క ఠిన నిబంధనలు తీసుకురావాలని కోరుతున్నారు.

దేశ సైనికులు తమ ప్రాణాలు పణంగా పెట్టి పాకిస్థాన్‌తో పోరాడుతుంటే క్రికెట్ పేరుతో ఆ టలు ఆడటం సమంజసం కాదని, వెంటనే భారత్ మ్యాచ్‌ను బహిష్కరించేలా నిర్ణయం తీసుకోవాలని సుప్రీంకోర్టులో పలువురు పిటిషన్‌లు కూడా దాఖలు చేయడం గమనార్హం. భారత్, పాక్ మ్యాచ్‌ను ఢిల్లీలో స్క్రీ న్లు వేసి ప్రదర్శిస్తే తాము నిరసనకు దిగుతామని ఆప్ పార్టీ హెచ్చరికలు జారీ చేసింది.

మరోవైపు ఐసీసీ టోర్నీల్లో పాకిస్థాన్‌తో మ్యాచ్‌లను బహిష్కరించలేమని బీసీసీఐ పేర్కొంటుంది. అలా ఆడకుంటే టోర్నీ నుంచి భారత్‌ను ఎలిమినేట్ చేస్తారని వెల్లడించింది. ఇక పాకిస్థాన్‌తో ద్వైపాక్షిక సిరీస్‌లు ఆడేది లేదని ఇది వరకే తీర్మానించామని, కానీ ఐసీసీ లాంటి మే జర్ టోర్నీల్లో మాత్రం పాక్‌తో మ్యాచ్‌లు తప్పించలేమని కేంద్ర క్రీడాశాఖ మంత్రి అనురాగ్ ఠాకూర్ పేర్కొన్నారు. భారత్, పాకిస్థాన్‌లు చివరిసారిగా 2012లో ద్వైపాక్షిక సిరీస్‌లో తలపడ్డాయి.

అప్పటినుంచి ఇరు దేశాలు ఐసీసీ ఆధ్వర్యంలో జరిగే వన్డే వరల్డ్ కప్, టీ20 ప్రపంచప్, ఐసీసీ చాంపియన్స్ ట్రోఫీ, ఆసియా కప్ లాంటి మేజర్ టోర్నీలకే పరిమితమయ్యాయి. అన్నీ సవ్యంగా సాగి ఉంటే ఈ ఏడాది చివర్లో భారత్, పాక్ మధ్య ద్వైపాక్షిక సిరీస్ జరగాల్సి ఉండేది. అయితే పహల్గాం ఉగ్రదాడి మరోసారి ఇరు దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడేలా చేసింది.