7 May, 2026 | 2:50 AM

3రోజుల్లో ఏఎన్‌ఎం ఫలితాలు!

07-05-2026 01:35 AM
  1. రిక్రూట్‌మెంట్‌కు తొలగిన కోర్టు అడ్డంకులు
  2. మూడేండ్ల ఎదురు చూపులకు ఎండ్ కార్డ్

హైదరాబాద్, మే 6 (విజయక్రాంతి): మల్టీ పర్పస్ ఫీమేల్ హెల్త్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి అడ్డంకులు తొలగిపోయాయి. కోర్టు కేసులు పరిష్కారం కావడంతో ఫలితాల విడుదలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమవుతోంది. మరో మూడు రోజుల్లో ఫలితాలు ప్రకటించే అవకాశం ఉందని బోర్డు అధికారులు తెలిపారు. 2023 ఎలక్షన్లకు 3 నెలల ముందు ఏఎన్‌ఎం పోస్టుల భర్తీకి బీఆర్‌ఎస్ సర్కార్ నోటిఫికేషన్ ఇచ్చింది. కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఏఎన్‌ఎంలను బుజ్జగించేందుకు వారికి 30 మార్కుల వెయిటేజీ ఇస్తామని నోటిఫికేషన్‌లో ప్రకటించింది. దీంతో నిరుద్యోగ (నాన్ సర్వీస్) ఏఎన్‌ఎంలు కోర్టుకు వెళ్లారు. 30 మార్కులు ఇవ్వడం చట్ట విరుద్ధమని, వెయిటేజీని పూర్తిగా తీసివేయాలని పిటిషన్ దాఖలు చేశారు.

దీంతో రిక్రూట్మెంట్‌కు బ్రేకులు పడ్డాయి. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రిక్రూట్మెంట్లకు సంబంధించి కోర్టుల్లో ఉన్న అన్ని సమస్యలను పరిష్కరిస్తూ.. ఆరోగ్యశాఖలో రిక్రూట్మెంట్లు వేగంగా జరిగేలా చర్యలు తీసుకుంది. ఈ క్రమంలో ఇప్పటికే 12,649 పోస్టుల భర్తీ ప్రక్రియను పూర్తి చేసింది. ఏఎన్‌ఎం పోస్టులకు సంబంధించి హైకోర్టు సింగిల్ బెంచ్ వద్ద ఉన్న కేసులోనూ ప్రభుత్వం తన వాదనలు వినిపించి రిక్రూట్మెంట్ ఆపొద్దని కోరింది. ఈ క్రమంలోనూ కోర్టు మధ్యంతర ఉత్తర్వుల మేరకు 2024 డిసెంబర్‌లో ఏఎన్‌ఎం పోస్టులకు సంబంధించిన రాత పరీక్ష నిర్వహిం చింది. కానీ, కోర్టులో కేసు ఉండడంతో తుది ఫలితాలను వెల్లడించలేకపోయింది. ఈ కేసులో ఇటీవలే కోర్టు తుది తీర్పును ఇచ్చింది.

కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు 20 శాతానికి మించి వెయిటేజీ ఇవ్వడానికి వీల్లేదని స్పష్టం చేసింది.  కోర్టు తీర్పు ప్రకారం 20 శాతం వెయిటేజీ ఇచ్చి, రిక్రూట్మెంట్ పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇటీవల ఈ అంశంపై రివ్యూ చేసిన ఆరోగ్యశాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ.. వీలైనంత త్వరగా ఫలితాలు విడుదల చేసి, భర్తీ ప్రక్రియ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు.   1931 పోస్టులకు సంబంధించిన పోస్టుల ఫలితాల విడుదలకు మెడికల్ అండ్ హెల్త్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు సిద్ధమవుతోంది.