calender_icon.png 9 May, 2025 | 1:21 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

నవ్వుల డ్రాగన్!

16-04-2025 12:00:00 AM

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో సరదాగానే మరో యుద్ధం సాగిస్తోంది. టారిఫ్ వార్ మరో రకంగా ఇది సైకలాజికల్ వార్. ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ అనే ట్రంప్ నినాదంతో చైనా తన సోషల్ మీడియా ప్లాట్‌ఫాంలపై వ్యంగ్య వీడియోలతో విరుచుకు పడుతోంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఎలాన్ మస్క్, జేడీ వాన్స్ ఓ ఫ్యాక్టరీలో కార్మికులతో కలిసి బూట్లు తయారు చేస్తున్నట్టు ఒక వీడియో. అలసి సొలసి ఒక అమెరికన్ ఊబకాయంతో నిర్లిప్తంగా కుట్టు మిషన్‌పై పని చేస్తుంటాడు. ఇదో చిత్రం.

అమెరికాతో దిగుమతి సుంకాల పోరాటంలో తొడ గొడుతూనే చైనా ఇస్తున్న హైటెక్ ట్విస్టులివి. చైనా నుంచి పుట్టుకొస్తున్న మీమ్స్, వీడియోలను క్షణాల్లో లక్షాలాది మంది వీక్షిస్తున్నారు. నవ్వుకుంటున్నారు. అమెరికాలో వస్తు తయారీ పునరుద్ధరణతో సుసంప్నమవుతామని చెపుతున్న ట్రంప్‌ను చైనా ఓ అంతర్జాతీయ జోకర్‌గా చిత్రీకరిస్తున్నది. అమెరికా చెప్పుల దిగుమతిలో చైనా వాటా 62 శాతం. అమెరికా తయారీ ఒక్క శాతం మాత్రమే. 

మరి అమెరికన్లకు అవసరమైన చెప్పులు డిమాండ్ మేర సప్లు కావాలంటే అది ఎప్పటికి సాధ్యమని చైనా ప్రశ్నిస్తున్నది. ఒకవేళ, చైనా వస్తువులేవీ మార్కెట్‌లో దొరక్క అమెరికా ఉత్పత్తులనే కొనాల్సి వస్తే వాటి ధర ఎంత ఉంటుంది? వాటిని చీప్‌గా దొరికే చైనా ఉత్పత్తులతో సరిపోల్చుకుంటే ఎంత ఎక్కువ చెల్లించాల్సి ఉంటుందోనని స్వల్పాదాయ అమెరికన్ల చింత. అమెరికన్లలో భయాలు అంతకంతకూ పెరిగేలా చైనా తన సోషల్ మీడియాను ఉపయోగిస్తున్నది. ఈ సోషల్ మీడియా వార్‌పై చైనాలో ఇప్పుడు సెన్సార్ కూడా లేదు.

అక్కడి ఉన్నతాధికారులే తమ వ్యంగ్య వీడియోలను టిక్‌టాక్ వంటి ఫ్లాట్‌ఫాంలలో షేర్ చేస్తున్నారు. అమెరికాలో ఒక టోపీ ఖరీదు ఇప్పుడు 50 డాలర్లు అనుకుంటే, అది ‘మేక్ అమెరికా గ్రేట్ ఎగైన్’ నినాదంతో 77 డాలర్లకు పెరుగుతుందని చైనా మరో జోకు. ట్రంప్ తెచ్చే టారిఫ్‌లతో అమెరికన్ల జేబులకు చిల్లులు పడక మానవని చైనా హెచ్చరిస్తున్నది. 

ఒక్క పాదరక్షలే కాదు ఎలక్ట్రానిక్ వస్తువులు, దుస్తులు దిగుమతుల సుంకంతో మీరు కొనలేరని చైనా భయపెడుతున్నది. సరదా సరదా మీమ్స్‌తోనే చైనా ఇలా అమెరికాతో ఒక ఆటాడుకుంటున్నది. వీటిలో చైనీయులకు దేశభక్తి రగిలించే సంగీతం షరా మామూలే. చైనా వస్తువులనే అమెరికన్ కంపెనీలు ఎక్కువ ధరకు విక్రయించే పరిస్థితి వస్తుందని చైనా ప్రచారం చేస్తున్నది. సోషల్ మీడియాలో పుట్టుకొస్తున్న జోకులను చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ బాగా ఆస్వాదిస్తుండవచ్చు. అయితే ఈ సుంకాలను చైనా చివరికి దిగుమతి నౌకల్లో సరుకు పంపితే, వాటిపై ట్రంప్ సర్ చార్జీల మోత మోగిస్తే అప్పుడు కొత్త అధ్యాయం మొదలవుతుంది. ట్రంప్‌ను అంచనా వేసేట్టు లేదు. అలాగని చైనా తగ్గుతుందనీ చెప్పలేము.