calender_icon.png 9 May, 2025 | 10:13 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పరిశోధక విద్యార్థులకు కల్పవృక్షం

16-04-2025 12:00:00 AM

నేడు బిరుదురాజు రామరాజు శతజయంతి

తొలిసారిగా జానపద సాహిత్య వైశిష్ఠ్యాన్ని విశ్వవిద్యాలయా లు గుర్తించేలా చేసిన జానపద సాహితీవేత్త ఆచార్య బిరుదురాజు రామరాజు. 1955లో వారు రచించిన సిద్ధాంత గ్రం థం ‘జానపద గేయ సాహిత్యం’ ఈ ఘనతకు నాంది. తరువాతే యూనివర్సిటీలలో జానపద సాహిత్య శాఖలు వెలసి పుష్పిం చి ఫలించడం మొదలయ్యింది. జానపద సాహిత్యమంటేనే బిరుదురాజు అనేంతగా వారి పేరు తెలుగు సాహిత్యంలో స్థిరపడింది.  దక్షిణాదిన జానపద సాహిత్యంపై పరిశోధించి, పీహెచ్‌డీ పొందిన తొలి పరిశోధకుడు ఆయనే కావడం మరో విశేషం.

జానపద సాహిత్యం ఒక జాతి జనజీవనానికి జీవనాడి. పల్లెవాసులకు అక్షర జ్ఞానం లేకపోవచ్చు. కాని అలవోకగా వా ళ్ళు సృష్టించిన పాటలు, కథలు, గేయాలు తరతరాల సాహిత్య సంపద. ఇందులోనే జాతి ఆచార వ్యవహారాలు, సంస్కృతీ స భ్యతలు, జీవన విధానం నిక్షిప్తమై ఉం టాయి. మట్టివాసనలా సహజ పరిమళా లు వెదజల్లే సౌరభాలు ఇవి. పల్లెల్లో అచ్చతెలుగు తియ్యందనాలు ఈ ఊహల్లో, ఈ పాటల్లో జాలు వారుతుంటాయి. ఈ సాహిత్య సంపద ప్రాభవాన్ని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రతిష్ఠించిన ఘనత బిరుదురాజు వారికే దక్కింది. 

పట్టువదలని విక్రమార్కుని వలె!

ఆచార్య రామరాజు సాహిత్య పరిశోధనలో చేసిన కృషి, పడిన కష్టం, నిజాయితీ, పట్టుదలతో సాధించిన విజయాలివి. మరుగున పడిన విస్మృత జానపద సాహిత్యాన్ని వెలికి తెచ్చి, అందులోని గొప్పద నాన్ని అందరు గుర్తించేలా చేశారు. ఈ కృషికి తగిన గుర్తింపు నేడు లభిస్తుందా? అని ప్రశ్నించుకోవలసిన అవసరం ఉంది. జానపద సాహిత్యంపై పరిశోధన ఆ రోజుల్లో చేయడం అంటే అంత తేలిక కాదు. అప్పటి వరకు ఎవ్వరూ చేయని పరిశోధన అది. ఈ రోజుల్లో మాదిరిగా ఇం టర్నెట్ సౌలభ్యం ఉన్న కాలమూ కాదు. జానపద సాహిత్యమంతా పల్లెల్లో, పల్లెవాసుల్లో ఉంటుంది.

రవాణా సౌకర్యాలు కూ డా అంతంత మాత్రంగానే ఉన్న రోజులు. కాలి నడకన, ఎడ్లబండ్లపై, ఎండనక, వాననక రాత్రింబవలు తిరుగుతూ ఒక యజ్ఞం లా ఆయన పరిశోధనలో లీనమయ్యారు. ముళ్ళదారులు, మట్టిరోడ్లపైనే ఆయన ప్రయాణాలు. పైగా చాలా ఖర్చుతో కూడి న పని. అయినా, ఆయన పట్టు వదల్లేదు. పల్లె నేలల్లో ఉన్న జానపద సాహిత్య సు గంధాన్ని శోధనా సాగుతో పండించి ఫలసాయాన్ని మనకు అందించారాయన.

ఉ స్మానియా విశ్వవిద్యాలయంలో తెలుగులో చేసిన తొలి పరిశోధనే కాకుండా, జానపద సాహిత్యం గురించి దక్షిణ భారతంలోని విశ్వవిద్యాలయాల్లో అన్ని భాష ల్లోను ఇది తొలి పరిశోధన అనాలి. వారి తర్వాతే మిగతా విశ్వవిద్యాలయాల్లో ఇతర భాషల్లోను జానపద సాహిత్యంపై పరిశోధన ప్రారంభమైంది. జానపదుల జీవన విధానాలు తెలుసుకోవాలనే జిజ్ఞాసా పలువురిలో ప్రారంభమైంది. నిజానికి జానపద సాహత్యం గురించి అంతకు ముందు ఎవ్వరు రాయలేదని కాదు.  

మహామహుల దృష్టిని ఆకర్షించి..

వరంగల్ జిల్లా దేవనూరు గ్రామంలో లక్ష్మీదేవి, నారాయణ రాజు దంపతులకు 1926 ఏప్రిల్ 16న రామరాజు జన్మించా రు. తాతముత్తాతలు పండితులు కావడంతో సాహిత్య వాతావరణంలో పెరిగా రు. స్కూలు కాలంలోనే గ్రంథాలయాల్లో పుస్తకాలను ఆసక్తిగా చదవడం అలవడిం ది. మడికొండలో వారి పెదనాన్న రాఘవరాజు వద్ద పెరిగి, విద్యాబుద్ధులు నేర్చుకు న్నారు. అక్కడే వానమామలై వరదాచార్యులు, వానమామలై జగన్నాథాచార్యు లు, ప్రజాకవి కాళోజీ నారాయణరావు, వారి సోదరుడు కాళోజీ రామేశ్వరరావు, పల్లా దుర్గయ్య, అనుముల కృష్ణమూర్తిలతో పరిచయాలు ఏర్పడ్డాయి.

ఫలితంగా తెలుగు సాహిత్యం పట్ల అభిరుచి, ఆసక్తి పెరిగాయి. ఇంటర్‌మీడియెట్ కోసం హైదరాబాద్‌కు రావడంతో, పరిశోధనా రంగం లో విశేష కృషి చేసిన సురవరం ప్రతాపరెడ్డి దృష్టిని ఆకర్షించారు. చదువుకుంటూ హైదరాబాద్ సివిల్ సర్వీస్ కమిషన్ పరీక్ష రాసి జిల్లా పంచాయితీ అధికారిగా ఉద్యో గం సంపాదించారు. అయితే, ఆయన అం దులో చేరలేదు. నిజాం కళాశాలలో బీఏ లో చేరారు. హైదరాబాద్ విద్యార్థి సమా ఖ్య అధ్యక్షుడిగా పనిచేశారు. నిజాం వ్యతిరేక సత్యాగ్రహంలో పాల్గొని జైలుకు వెళ్లా రు.

తర్వాత ఎంఏ చేశారు. దేశంలో జరుగుతున్న తొలి ఎన్నికలలో కాంగ్రెసు పార్టీ టికెట్ ఇస్తామన్నా, సురవరం వారి సలహాపై తిరస్కరించారు. 1951లో లెక్చ రరుగా ఉద్యోగ జీవితం ప్రారంభించి, ఆచార్య పదవిని అలంకరించడం ద్వారా ఎంతోమంది శిష్యప్రశిష్యులకు స్ఫూర్తినిచ్చారు. రామరాజు సిద్ధాంతగ్రంథంలోని అధ్యాయాలను రామాయణ, భారత, భా గవత సంబంధ, చారిత్రక గేయాలు, స్త్రీలు, పిల్లల పాటలు వంటి విభాగాలుగా వర్గీకరించారు. ప్రతి అధ్యయం తర్వాతి కాలా ల్లో పరిశోధకులకు మార్గదర్శకమైంది. తెలుగు సాహిత్యంలో వివిధ ప్రక్రియల్లో ఆయన విశేష కృషి సలిపారు.

అనేక గ్రం థాలు రచించారు. చరిత్రకెక్కని చరితార్థులు, మరుగున పడిన మాణిక్యాలు పేరు తో చరిత్ర మరిచిపోయిన అనేకమంది పె ద్దల జీవిత విశేషాలకు గ్రంథరూపం ఇచ్చారు. తెలుగు జానపద రామాయణం, తెలుగు సాహిత్యోద్ధారకులు, యక్షగాన వాఙ్మయం, తెలంగాణ పల్లె పాటలు  వంటి అనేక గ్రంథాలు వెలువరించారు. 

200 మంది కవుల జీవిత విశేషాలు

జానపద సాహిత్యాన్ని చిన్నచూపు చూ స్తూ, అసలు జానపదాన్ని సాహిత్యంగానే ఒప్పుకోని రోజుల్లో సాహసించి ‘తెలుగు జానపద గేయ సాహిత్యం’ శీర్షికతో గ్రం థాన్ని17 ప్రకరణలతో తెచ్చారు. ఇది 1972లో ఎంఏ విద్యార్థులకు పాఠ్యాంశం. ఇప్పటికీ జానపదంపై పరిశోధనలు చేసే విద్యార్థులకు ఇది ప్రామాణిక గ్రంథమే. సంస్కృత సాహిత్యంపైనా లోతైన పరిశోధన జరిపారు. ‘కంట్రిబ్యూషన్ ఆఫ్ ఆంధ్ర టు సంస్కృత్ లిటరేచర్’ పేరున పరిశోధన గ్రంథమూ వెలువరించారు. నిజానికి ఇది సంస్కృతంలో పీహెచ్‌డీ కోసం రాసిన గ్రంథం. కానీ, ఇదే అంశంపై ఆంధ్ర విశ్వవిద్యాలయంలో మరొకరు పరిశోధన చే స్తూన్నరనే కారణంతో రామరాజు దీనిని కేవలమొక పుస్తకంగా ప్రచురించారు. ఇందులో దాదాపు 200 మంది కవుల జీవిత విశేషాలు ఉన్నాయి. 

ఆయన రాసిన ‘ఆంధ్రయోగులు’ ప్ర పంచ సాహిత్యంలోనే అరుదైన గ్రంథం. వందలాది యోగుల జీవిత చరిత్రలను ఏడు సంపుటాలుగా సంకలనం చేసి మన కు అందించారు. ప్రతిభకు సకాలంలో గుర్తింపు లభించక పోయినా, పదవులు రా కపోయినా ఆయన పట్టించుకోలేదు. జానపదం సాహిత్యమా? దానిపై పరిశోధన కూడా ఒక పరిశోధనేనా?? అనే చులకన భావం నాటి కొందరు పండితుల్లో ఉండే ది. కేవలం జాన పదానికి మాత్రమే బిరుదురాజు పరిమితం కాలేదు. వందలాది సంస్కృతాంధ్ర తాళపత్ర గ్రంథాల ను సేకరించి, పరిష్కరించి ముద్రించారు.

నిజానికి బిరుదురాజు రామరాజు సాహిత్యసేవపై అనేక పరిశోధనలు జరగాలి. కాని, కేవలం కంచి విజయలక్ష్మి చేసిన పరిశోధన తప్ప, మరొకటి ఏదీ మనకు కనిపించదు. రామరాజు పరిశీలించి, పరిష్కరించి, వెలుగులో కి తెచ్చిన సంస్కృత గ్రం థాలపై ఇంకా వారు సేకరించిన తాళపత్ర గ్రంథాలపైనా పరిశోధనలు జరగాలి. నేడు (ఏప్రిల్ 16) బిరుదురాజు శతజయంతి సందర్భంగా ‘తెలంగాణ సాహిత్య అకాడమి’ వారి జానపద సాహిత్య కృషిపై ‘పునాస’ త్రైమాసిక సాహిత్య ప్రత్యేక సంచికను తెస్తోంది. 

వ్యాసకర్త : డా. నామోజు బాలాచారి, కార్యదర్శి, తెలంగాణ సాహిత్య అకాడమి