31-12-2025 12:25:18 AM
నిజామాబాద్, డిసెంబర్ 30 (విజయ క్రాంతి): నిజామాబాద్ పట్టణంలో విద్యావంతులు నిరుద్యోగ మహిళ అభ్యర్థులకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో ఇనిస్టిట్యూట్ బైతుల్ మాల్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత శిక్షణ కేంద్రంలో త్రైమాసిక ప్రమోషన్ స్కిల్స్ శిక్షణా కోర్సు పథకాన్ని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ ప్రారంభించారు.
ఈ సందర్భంగా మహమ్మద్‌అలీ షబ్బీర్ మాట్లా డుతూ.. తెలంగాణ ప్రభుత్వం 4% రిజర్వేషన్ అందించడం ద్వారా మైనార్టీ పిల్లలు ఇంజనీరింగ్ ఎంబీబీఎస్ చదివి డాక్టర్ ఇంజనీర్లుఅవుతున్నారు.మహిళలు ఆర్థికంగా స్వావలంబన సాధించాలంటే నైపుణ్య శిక్షణ ఎంతో కీలకమని అన్నారు. ప్రభుత్వం మహిళల అభివృద్ధికి ఎల్లప్పుడూ కట్టుబడి ఉం దని, అందులో భాగంగానే బైతుల్ మాల్ సంస్థ ద్వారా ఉచిత శిక్షణా కార్యక్రమాలను ప్రోత్సహిస్తున్నామని తెలిపారు.
ఈ శిక్షణ కేంద్రం మౌలిక సదుపాయాల అభివృద్ధి కోసం ప్రభుత్వం నుండి రోడ్ నిర్మాణానికి పది లక్షల రూపాయలు, భవన మొదటి అంతస్తు నిర్మాణానికి 25 లక్షల రూపాయలను మంజూరు చేసినట్లు వెల్లడించారు. ఈ సంస్థ మరింత అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో తన సొంత నిధుల నుంచి రెండు లక్షల రూపాయలను అందజేసినట్లు షబ్బీర్ అలీ తెలిపారు. ఈ ఉచిత శిక్షణా కార్యక్రమం ద్వారా విద్యావంతులైన నిరుద్యోగ మహిళలు, విద్యార్థులకు ఉపాధికి అనుకూలమైన పలు కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నట్లు నిర్వాహకులు తెలిపారు.
ముఖ్యంగా కంప్యూటర్ శిక్షణ, టైలరింగ్, మెహందీ డిజైన్, అడ్వానస్డ్ బ్యూటీషియన్ వంటి కోర్సుల్లో నిపుణుల ద్వారా శిక్షణ అందించి, భవిష్యత్తులో స్వయం ఉపాధి సాధించేలా మార్గనిర్దేశం చేయనున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో బైతుల్ మాల్ సంస్థ ప్రతినిధులు, స్థానిక నాయకులు, శిక్షణార్థులు పాల్గొని ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ గారికి కృతజ్ఞతలు తెలిపారు. మహిళల జీవితాల్లో మార్పుకు ఈ శిక్షణ కేంద్రం దోహదపడుతుందని వారు ఆశాభావం వ్యక్తం చేశారు.