31-12-2025 02:03:17 PM
కొండాపూర్: నూతన సంవత్సర వేడుకలు నిర్వహించుకునే ప్రజలు తప్పనిసరిగా జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉండి పిల్లలు,పెద్దలు అందరూ తమ ఇండ్లలోనే కుటుంబ సభ్యులతో కలిసి ఉత్సవాలు జరుపుకోవాలని కొండాపూర్ పోలిస్ స్టేషన్ ఎస్సై సోమేశ్వరీ మంగళవారం ఓ ప్రకటనలో సూచించారు. పోలీసుల సూచనలు, నిబంధనలు పాటించడం ద్వారా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నివారించవచ్చని తెలిపారు. డిసెంబర్ 31 రాత్రి నూతన సంవత్సర వేడుకల సందర్భంగా మండల పోలీస్ యంత్రాంగం తరపున పటిష్టమైన బందోబస్తు, నిరంతర పెట్రోలింగ్ ఏర్పాటు చేయబడుతుందని తెలిపారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వహించబడతాయని అన్నారు.
ప్రజలకు ఇబ్బందులు కలిగించే విధంగా బహిరంగ ప్రదేశాల్లో వేడుకలు నిర్వహిస్తే చట్టప్రకారం తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రమాదకరంగా, ప్రజలకు ఇబ్బంది కలిగించే రీతిలో వేడుకలు జరపవద్దని స్పష్టం చేశారు. కొండాపూర్ మండలానికి సంబంధించిన బైపాస్ రహదారి వెంబడి డిసెంబర్ 31 రాత్రి నిరంతర పెట్రోలింగ్ నిర్వహించబడుతుందన్నారు. ఈ మార్గంలో రాష్ డ్రైవింగ్, రాష్ రైడింగ్, బైక్ రేసింగ్, స్టంట్స్ వంటి ప్రమాదకర చర్యలకు ఎవరూ పాల్పడరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. డిసెంబర్ 31 రాత్రి ఆర్గనైజ్డ్ కార్యక్రమాలు నిర్వహించడానికి పోలీసు అనుమతి లేదని,
వేడుకలను కుటుంబ సభ్యులతో కలిసి ఇండ్లలోనే జరుపుకోవాలన్నారు. పిల్లల పట్ల ప్రత్యేక జాగ్రత్తలు పాటించాలని, మైనర్లకు వాహనాలు ఇవ్వకూడదని, టపాసులు పేల్చడం, డీజేలు ఉపయోగించడం నిషేధం అన్నారు. మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం, అతివేగం వద్దన్నారు. రహదారులు బ్లాక్ చేసి ఉత్సవాలు నిర్వహించరాదని, ఇతరులకు ఇబ్బంది కలిగించే చర్యలకు పాల్పడవద్దన్నారు. ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్లు తొలగించి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం వంటి చర్యలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. న్యూ ఇయర్ వేడుకల్లో నిషేధిత డ్రగ్స్, గంజాయి వంటి మత్తు పదార్థాల విక్రయం లేదా వినియోగంపై కఠిన చర్యలు ఉంటాయన్నారు.
మద్యం దుకాణాలు నిర్ణీత సమయానికే మూసివేయాలని, మైనర్లకు మద్యం విక్రయించరాదని, బహిరంగ ప్రదేశాలు, ప్రభుత్వ స్థలాల్లో మద్యం సేవిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఏ కార్యక్రమమైనా నిర్వహించాలంటే తప్పనిసరిగా ముందస్తు పోలీసు అనుమతి తీసుకోవాలన్నారు. న్యూ ఇయర్ ఆఫర్ల పేరుతో సైబర్ నేరగాళ్లు మోసాలకు పాల్పడే అవకాశం ఉన్నందున, అపరిచితులకు వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ ఖాతా వివరాలు, పిన్ నంబర్లు ఇవ్వవద్దు.అపరిచిత వ్యక్తుల ద్వారా వచ్చిన న్యూ ఇయర్ మెసేజ్లను ఓపెన్ చేయరాదని, ఫార్వర్డ్ చేయరాదన్నారు. అత్యవసర పరిస్థితుల్లో కొండాపూర్ పిఎస్ కు లేదా డయల్ 100 కు ఫోన్ చేసి పోలీసు సేవలను వినియోగించుకోవాలని మండల ప్రజలను కోరారు.