31-12-2025 01:49:25 PM
హైదరాబాద్: డెహ్రాడూన్ లో త్రిపురకు చెందిన ఏంజెల్ చక్మా(Angel Chakma) హత్యపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీ రామారావు(BRS Working President KT Rama Rao) దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. చక్మా హత్య దృష్ట్యా జాతివివక్ష మానవత్వానికే గొడ్డలిపెట్టు అన్నారు. జాతి వివక్షకు వ్యతిరేకంగా కఠిన చట్టాలు తీసుకురావాలని కేంద్రాన్ని కోరారు. జాతి వివక్షను దాని అన్ని రూపాల్లోనూ తీవ్రంగా ఖండిస్తున్నట్లు కేటీఆర్ తెలిపారు. ఇది మానవాళికి వ్యతిరేకంగా జరిగే ఒక తీవ్రమైన నేరమని, భారతదేశ రాజ్యాంగ విలువల మూలాలనే దెబ్బతీస్తుందన్నారు. డెహ్రాడూన్‌లో జాతి వివక్షాపూరిత మూక దాడిలో మరణించిన త్రిపురకు చెందిన ఎంబీఏ విద్యార్థి ఏంజెల్ చక్మా హత్యపై ఆయన ఈ విధంగా స్పందించారు. పక్షపాతం, అధికారం, శిక్ష నుండి తప్పించుకునే అవకాశం అనేవి కలిసిపోయినప్పుడు ఎంతటి వినాశకరమైన పరిణామాలు సంభవిస్తాయో ఈ సంఘటన ఒక స్పష్టమైన హెచ్చరిక కేటీఆర్ తెలిపారు.
“నేను చైనీయుడిని కాదు... నేను భారతీయుడిని” ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో డిసెంబర్ 9న ఒక జాత్యహంకార మూక చేతిలో దారుణంగా దాడికి గురైన త్రిపురకు చెందిన 24 ఏళ్ల విద్యార్థి ఏంజెల్ చక్మా చివరి మాటలు ఇవి. అతను తన సోదరుడితో కలిసి సెలక్యూయ్ ప్రాంతంలో కొన్ని ఇంటి సామాన్లు కొనుగోలు చేస్తుండగా, మద్యం మత్తులో ఉన్న కొందరు వ్యక్తులు అతనిపై కుల దూషణలకు పాల్పడ్డారు. చక్మా వారి వ్యాఖ్యలను అభ్యంతరపెట్టడంతో, వారు హింసాత్మకంగా మారి కర్రలు, కత్తులతో అతనిపై దాడి చేశారని ఎఫ్ఐఆర్ ప్రకారం తెలిసింది. డెహ్రాడూన్‌లోని ఒక ఆసుపత్రిలో 16 రోజుల పాటు మృత్యువుతో పోరాడిన ఆ 24 ఏళ్ల ఏంజెల్ చక్మా మరణించాడు.