calender_icon.png 7 July, 2025 | 12:32 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తులతో కిక్కిరిసిన భద్రకాళి దేవాలయం

06-07-2025 08:26:50 PM

వరంగల్/మహబూబాబాద్ (విజయక్రాంతి): కాకతీయుల రాజధాని ఏకశిలానగరంగా చరిత్ర ప్రసిద్ధిగాంచిన వరంగల్ మహానగరంలో పరమపావనమైన పుణ్యక్షేత్రంగా విరాజిల్లుతున్న శ్రీ భద్రకాళి దేవస్థానంలో శాకంభరీ నవరాత్ర మహోత్సవములు(Shakambari Navratri Celebrations) పదకొండవ రోజుకు చేరుకున్నాయి. ఆదివారం ఉదయం 5 గంటలకు నిత్యాహ్నికం పూర్తిచేసిన పిమ్మట తిథి మండల దేవతా యజనంలో భాగంగా కాళీ క్రమాన్ననుసరించి అమ్మవారి ఉత్సవ మూర్తులలో ఇచ్చాశక్తిని ‘మనా’ గాను, షోడశీ క్రమాన్ననుసరించి జ్ఞానశక్తిని ‘నీలపతాకా’ నిత్యగాను అలంకరించి పూజారాధనలు జరిపారు. దశమహా విద్యలలో అద్యవిద్యయైన కాళీ సవర్యా క్రమంలో ఏకాదశికి అధిదేవత ఘనా. ఈ ఘనా అమ్మవారు మేఘాలను రంజింపజేసి వర్షింపజేస్తుంది.

ఈమెనే అమృతవర్షిణి అనికూడా అంటారు. సకాలంలో వర్షాలు పడటానికి అతివృష్టి, అనావృష్టి లేకుండా సువృష్టి కలిగి సుభిక్షమవడానికి  అనుగ్రహం ప్రధానంగా కావాలి నీలపతాకా అమ్మవారు వర్షాలను అడ్డుకునే అసురీ శక్తులను ధ్వంసం చేస్తుంది. నీలవర్ణము కలిగిన పతాకమును కలిగియుంటుంది. ఆ పతాకమును చూచిన వెంటనే వర్షాలను ఆటంకపరిచే శక్తులు దూరంగా పారిపోతాయి. కాబట్టి నీలపతాకా అమ్మవారిని ప్రజలు బాగా ఆరాధిస్తారు. ఈ రోజు తొలి ఏకాదశి కావండంతో భక్తులు దేవాలయానికి అధిక సంఖ్యలో వచ్చారు.

ఈ రోజు నుండి విష్ణుమూర్తి పాలకడలిలో శేష పాన్పుపై నాలుగు నెలల పాటు నిద్రిస్తాడు. ఈ సమయంలో విష్ణుమూర్తి సోదరియైన జగన్మాత ఈ నాలుగు నెలలు విష్ణుమూర్తి యొక్క పరిపాలనా బాధ్యతలు నెరవేరుస్తూ ప్రజలకు సుఖసంతోషాలను కలిగిస్తుంది. అందుకే ఈ నాలుగు నెలల ఆస్తికులు జగన్మాత పరివారాన్ని అనగా గణపతిని, శంకరుడిని, అమ్మవారిని ఇతోదికంగా ఆరాధిస్తారు. ఈ నాలుగు నెలలు ఎక్కడ చూసినా భగవదారాధన ఎక్కువగా ఉంటుందని ఆలయ ప్రధానార్చకులు శ్రీ భద్రకాళి శేషు తెలిపారు. దేవాలయానికి విచ్చేసిన ఆశేష భక్తులకు అసౌకర్యం కలుగకుండా దేవాలయ ధర్మకర్తలు తొనుపునూరి వీరన్న, గాదె శ్రవణ్ కుమార్ రెడ్డి, మోతుకూరి మయూరి, జారతి వెంకటేశ్వర్లు, అనంతుల శ్రీనివాస్ రావు, ఈఓ శేషుభారతి పర్యవేక్షించారు.