06-07-2025 08:56:47 PM
వాజేడు (విజయక్రాంతి): ములుగు జిల్లా(Mulugu District) వాజేడు మండలంలో చీకుపల్లి గ్రామ అటవీ ప్రాంతంలో వెలసిన బొగత జలపాతం(Bogatha Waterfall)కు ఆదివారం పర్యాటకులతో సందడి నెలకొంది. ములుగు జిల్లాలో వాజేడు వెంకటాపురం మండలాలలో నెలకొన్న జలపాతాలు కొంగాల దుసపాటిలొద్ది, గుండం, మహితాపురం, ముత్యందార మొదలగు జలపాతాలకు ప్రభుత్వ అనుమతి లేకపోవడంతో బొగత జలపాతంకు పర్యటకుల తాకిడి ఎక్కువగా కనిపిస్తోంది. ఆదివారం సెలవు కావడంతో హైదరాబాద్, వరంగల్, కరీంనగర్, ములుగు జిల్లాల నుండి పర్యాటకులు అధిక సంఖ్యలో విచ్చేశారు. వందల సంఖ్యలో వాహనాలు, వేల సంఖ్యలో పర్యటకులతో బొగత అటవీ ప్రాంతం కళకళలాడింది.
వివిధ పట్టణ ప్రాంతాల నుండి కుటుంబ సమేతంగా విచ్చేసి అటవీ ప్రాంత ప్రకృతిని ఆస్వాదిస్తూ, జలపాత అందాలను చూసి మంత్రముగ్ధులైనారు. జలపాత కొలనులో చిన్నారులతో కలిసి స్నానాలు చేస్తూ అల్లరి చేస్తూ సంతోషంగా గడిపారు. బొగత ఆవరణంలో ఏర్పాటుచేసిన వాచ్ టవర్ నుండి ప్రకృతి అందాలను వీక్షించారు. తెలంగాణ , చత్తీస్గడ్ అటవీ ప్రాంతాలలో గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలతో ఎగిసిపడుతున్న జలపాత నీటి దారాలు సందర్శకులకు కనువిందు కలిగిస్తున్నాయి. ఆదివారం వెయ్యి మందికి పైగా సందర్శకులు వచ్చినట్లు అటవీ అధికారులు వెల్లడించారు. కాగా అటవీ అధికారులు జలపాత సందర్శకులకు అడుగడుగునా నియమాలతో కూడిన హెచ్చరికలు జారీ చేస్తూ భద్రత కల్పించారు.