27-09-2024 12:00:00 AM
గోద్రా రైలు దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మారణకాండ ఇప్పటికీ దేశ ప్రజల మనసుల్లోంచి చెదిరిపోలేదు. ఈ సందర్భంగా అయిదు నెలల గర్భిణిగా ఉన్న బిల్కిస్ బానోపై సామూహిక అత్యాచారం, ఆమె కుటుంబంలోని ఏడుగురు సభ్యుల దారుణ హత్య అప్పట్లో దేశాన్ని కుదిపేసింది. ఈ హత్య కేసులో జీవిత ఖైదుపడిన 11 మంది దోషులను సత్ప్రవర్తన సాకుతో ముందుగా విడుదల చేయడం చెల్లదంటూ గత జనవరిలో సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. రెండు వారాల్లోగా దోషులను మళ్లీ జైలో పెట్టాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ వ్యవహారంలో గుజరాత్ ప్రభుత్వం తీరును తీవ్రంగా తప్పుబడుతూ న్యాయస్థానం పలు కీలక వ్యాఖ్యలు చేసింది.
లేని అధికారాన్ని గుజరాత్ ప్రభుత్వం వాడుకుందని, అది ఏ విధంగా చూసినా చట్ట ఉల్లంఘనేనని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు తీర్పును ఉపయోగించుకుని చట్టాన్ని ధిక్కరించి దోషులకు శిక్ష తగ్గించారని చెప్పడానికి ఇదో తిరుగులేని ఉదాహరణ అంటూ అప్పట్లో రాష్ట్రప్రభుత్వం తీరును ఎండగట్టింది. అయితే ఈ తీర్పులో రాష్ట్రప్రభుత్వంపై చేసిన తీవ్ర వ్యాఖ్యలను తొలగించాలని కోరుతూ గుజరాత్ ప్రభుత్వం మరో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై విచారణ చేపట్టిన ధర్మాసనం గురువారం మరోసారి ప్రభుత్వం తీరును ఎండగడుతూ పిటిషన్‌ను కొట్టివేసింది.
ఓపెన్ కోర్టులో సమీక్షించేందుకు లిస్టింగ్ చేయాలన్న అభ్యర్థనను సైతం జస్టిస్ బీవీ నాగరత్న, జస్టిస్ ఉజ్జల్ భుయాన్‌తో కూడిన ధర్మాసనం తోసిపుచ్చింది. గతంలో తాము ఇచ్చిన తీర్పులో ఎలాంటి తప్పూ లేదని స్పష్టమవుతోందని, అందువల్ల ఈ పిటిషన్లను పరిశీలించాల్సిన అవసరం కనిపించడం లేదని స్పష్టం చేసింది. నిజానికి బిల్కిన్ బానో కేసు ఎన్ని మలుపులు తిరిగిందో పరిశీలిస్తే ఆశ్చర్యం వేస్తుంది. 2002లో గోద్రా దహనకాండ అనంతరం గుజరాత్‌లో చెలరేగిన మత ఘర్షణల్లో భాగంగా హిందుత్వ వాదులు ముస్లిం కుటుంబాలపై అమానుషంగా దాడులు చేసి కనిపించిన వారిని కనిపించినట్లుగా హత్య చేశారు.
ఆ సమయంలో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని పారిపోతున్న బానో కుటుంబ సభ్యులపై దుండగులు దాడి చేసి అయిదు నెలల గర్భిణి అయిన ఆమెపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. అంతటితో ఆగని దుండగులు ఆమె మూడేళ్ల కూతురితో పాటుగా ఏడుగురు కుటుంబ సభ్యులను చంపేశారు. అప్పటినుంచి బిల్కిస్ బానో న్యాయపోరాటం చేస్తూనే ఉంది. ఈ కేసులో 11 మంది నిందితులకు 2008 జనవరి 21న సీబీఐ ప్రత్యేక కోర్టు యావజ్జీవ శిక్ష విధించింది. సీబీఐ ప్రత్యేక కోర్టు తీర్పును బాంబే హైకోర్టు సైతం సమర్థించింది. దీంతో వారంతా కటకటాల వెనక్కి వెళ్లారు.
అయితే 15 ఏళ్ల జైలు జీవితం తర్వాత వారిలో ఒకరు తనను విడుదల చేయాలంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. అతడి అభ్యర్థనను పరిశీలించాలంటూ అత్యున్నత న్యాయస్థానం జారీ చేసిన ఆదేశాల ఆధారంగా ఈ కేసులో నిందితులకు క్షమాభిక్ష ప్రసాదించే విషయమై పరిశీలన కోసం ప్రభుత్వం ఓ కమిటీని నియమించింది. అందరికీ రెమిషన్ మంజూరు చేయాలని ఆ కమిటీ సిఫార్సు చేసింది.ఇదే అదనుగా గుజరాత్ ప్రభుత్వం 2022 ఆగస్టు 15న అందరినీ విడుదల చేసింది. దీనిపై మరోసారి బిల్కిస్ బానో సుప్రీంకోర్టును ఆశ్రయించింది. గుజరాత్ ప్రభుత్వం లేని అధికారాలను ఉపయోగించుకోవడాన్ని తప్పుబట్టిన సుప్రీంకోర్టు రెమిషన్ ఉత్తర్వులను కొట్టేయాలని స్పష్టం చేసింది.
అయినప్పటికీ తీర్పులో రాష్ట్రప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను తొలగించాలంటూ గుజరాత్ ప్రభుత్వం మళ్లీ పిటిషన్ దాఖలు చేసింది. నిజానికి జైలునుంచి విడుదలయిన దోషులందరికీ సొంతూళ్లలో ఘనస్వాగతం లభించింది. బీజేపీకి చెందిన ఓ ఎంపీ, ఎమ్మెల్యే వారికి స్వాగతం పలికిన వారిలో ఉన్నారు. దోషుల్లో ఒకరైన రాధేశ్యామ్ అనే అతను తన లాయరు ప్రాక్టీస్ సైతం మొదలు పెట్టాడు. తాము తిరిగి జైలుకు వెళ్లకుండా ఉండేందుకు దోషులు రకరకాల ప్రయత్నాలు చేశారు. కానీ అవేవీ ఫలించలేదు.