31-01-2026 06:20:05 PM
ప్రజా ప్రభుత్వంలో నాలుగు హామీలు అమలు చేస్తున్నాం
ఎన్నికల ప్రచారంలో మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్
ధర్మపురి,(విజయక్రాంతి): ధర్మపురి ప్రజల ఆశీర్వాదంతో ప్రజా ప్రతినిధిగా ఎన్నికై రాష్ట్ర ప్రజలకు సేవచేసే అదృష్టం కలిగిందని, ప్రజలు ఇచ్చిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజాసేవ చేయడంతోపాటు చనిపోయే వరకు ప్రజల మధ్యే ఉంటానని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ, ఎస్టీ సంక్షేమశాఖ మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ అన్నారు. ధర్మపురి మున్సిపాలిటిలోని 15వవార్డులో శనివారం ఎన్నికల ప్రచారంలో మంత్రి పాల్గొన్నారు. ఈసందర్భంగా మంత్రి లక్ష్మణ్ కుమార్ మాట్లాడుతూ ఎన్నికల్లో గెలిచిన, ఓడిన ప్రజల మధ్యనే ఉన్నానని, ఈప్రాంత ప్రజలు ఇచ్చిన అవకాశంతో మంత్రి అయ్యే అవకాశం కాంగ్రెస్ పార్టీ కల్పించిందని అన్నారు.
తాను జీవించి ఉన్నంత కాలం ధర్మపురి ప్రజలమద్యే ఉంటానని ఆయన స్పష్టం చేశారు. 2018లో ఎన్నికల ప్రచారానికి ధర్మపురి వచ్చిన మాజీ సీఎం కేసీఆర్ అనేక హామీలు ఇచ్చి ధర్మపురి ప్రజలను మోసం చేశారనీ గుర్తు చేశారు. దళితులకు మూడు ఎకరాల భూమి, అర్హులకు డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టిస్తామని హమీ ఇచ్చి ఒక్కటి నేరవేర్చలేదని మంత్రి ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ర్టంలో అధికారంలోకి వచ్చిన ప్రజా ప్రభుత్వం ఆరు గ్యారంటిల్లో ఇప్పటికే నాలుగు గ్యారంటిలు అమలు చేస్తుందని, రానున్న రోజుల్లో మిగిలిన రెండు హామీలు కూడా నేరవేర్చుతామని మంత్రి అన్నారు.
ధర్మపురిలో రెండేళ్లలో అనేక అభివృద్ది, సంక్షేమ పథకాలు చేపట్టామనీ, దానిలో భాగంగా 695 కొత్తగా రేషన్ కార్డులు,154 ఇందిరమ్మ ఇళ్లు మంజూరి చేయడంతో పాటు ఇప్పటి వరకు రూ.7కోట్ల 70 లక్షలు చెల్లించామని మంత్రి అన్నారు. ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి 327 మందికి రూ. 93 కోట్ల 75వేలు అందజేశామని,కళ్యాణ లక్ష్మి పథకం ద్వార 206 పేదలకు రూ.2 కోట్ల6లక్షల 23వేలు, గృహ జ్యోతి పథకం ద్వార 2,783 మంది లబ్దిదారులకు 200 యూనిట్ల లోపు ఉచిత విద్యుత్ అందజేస్తున్నమని తెలిపారు. పట్టణంలో 542మంది రైతులకు రూ. 4 కోట్ల 2లక్షల 58 వేల రుణ మాఫీ చేశామన్నారు.
వార్డు అభివృద్ది కోసం ఇండిపెండెంట్ కాంగ్రెస్ కు మద్దతు
15వ వార్డు ఇండిపెండెంట్ అభ్యర్ధిగా పోటీ చేసిన వడ్లూరి సునిల్ తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు మంత్రి అడ్లూరి లక్ష్మణ్ కుమార్ సమక్షంలో ప్రకటించారు. ఈసందర్భంగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పి సునిల్ ను మంత్రి పార్టీలోకి ఆహ్వానించారు.