calender_icon.png 8 December, 2025 | 7:28 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పదాతిదళానికి గీతం సేవలు

08-12-2025 04:56:56 PM

రక్షణ సేకరణ నిర్వహణ వ్యవస్థను అభివృద్ధి చేసిన గీతం సీఎస్ఈ అధ్యాపకులు, విద్యార్థులు

పటాన్ చెరు: న్యూఢిల్లీలోని భారత సైన్యం, పదాతిదళ ప్రధాన కార్యాలయం కోసం ‘రక్షణ సేకరణ నిర్వహణ వ్యవస్థ’ అభివృద్ధి, విస్తరణకు గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం, హైదరాబాదు తోడ్పాటును అందించింది. గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ ఆచార్యురాలు ప్రొఫెసర్ ప్రీతి అంబరీష్ పర్వేకర్ నేతృత్వంలోని నలుగురు సభ్యుల బృందం ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తిచేసింది. ప్రధాన పరిశోధకురాలిగా వ్యవహరించిన ప్రొఫెసర్ ప్రీతి 2025 మే నుంచి నవంబర్ వరకు ఈ ప్రాజెక్టును నడిపించారు. నిరంతరం దశలవారీ విస్తరణల ద్వారా సజావుగా పురోగతిని నిర్ధారించారు. ఆమెకు సహాయ పరిశోధకుడిగా (కో-ప్రిన్సిపల్ ఇన్వెస్టిగేటర్) డాక్టర్ ఎస్. రామకృష్ణ, ఇద్దరు విద్యార్థి డెవలపర్లు- నిడదవోలు కుందన్, దిగుదాడి ప్రణశ్ రాహుల్ మద్దతు ఇచ్చారు. 

పదాతిదళంలో సేకరణ ప్రక్రియలను క్రమబద్ధీకరించి, బలోపేతం చేయడానికి రూపొందించిన ఈ వ్యవస్థ ఇప్పుడు పూర్తిగా సిద్ధమై, వినియోగ దశకు చేరుకుంది. ఇది జాతీయ రక్షణ కార్యకలాపాలకు గీతం హైదరాబాదు చేసిన గణనీయమైన సహకారాన్ని సూచిస్తోంది. ఈ విజయానికి గుర్తింపుగా, ఇండియన్ ఆర్మీ ఇన్ ఫాంట్రీ ప్రధాన కార్యాలయం ప్రొఫెసర్ ప్రీతి, ఆమె బృందాన్ని ఇటీవల జరిగిన తుది విస్తరణ, వ్యవస్థ ప్రదర్శన, సత్కార కార్యక్రమానికి న్యూఢిల్లీకి అధికారికంగా ఆహ్వానించింది. ఈ మైలురాయి గీతం స్కూల్ ఆఫ్ టెక్నాలజీలోని కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ విభాగానికి గర్వకారణంగా నిలుస్తుంది. ఇది ప్రభావవంతమైన, దేశ-కేంద్రీకృత సాంకేతిక ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడంలో ప్రొఫెసర్ ప్రీతి నాయకత్వాన్ని బలోపేతం చేస్తుంది.