11-07-2025 12:06:22 AM
కేంద్రమంత్రి, నటుడు సురేశ్ గోపి, నటి అనుపమ పరమేశ్వరన్ ప్రధాన పాత్రల్లో నటించిన చిత్రం ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’. చాలా కాలం నుంచి ఈ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వడంపై అభ్యంతరం వ్యక్తం చేసిన బోర్డ్ ఇప్పుడు వెనక్కి తగ్గింది. ముందు చెప్పిన విధంగా 96 కట్స్ వద్దని కేవలం రెండే మార్పులు చేయమని కోరింది. ఈ మేరకు సెన్సార్ బోర్డ్ తరపు న్యాయవాది కేరళ హైకోర్టులో తన వాదన వినిపించారు.
సినిమా టైటిల్ విషయంలో చిన్న మార్పు చేయమని కోరారు. ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ అని కాకుండా ఇందులో హీరోయిన్ పేరుకు అద్దం పట్టేలా ‘వి జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’ లేదా ‘జానకి వి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ’గా టైటిల్ మార్చమని తెలిపారు. సినిమాలోని ఓ కోర్టు సన్నివేశంలో హీరోయిన్ పేరును మ్యూట్ చేయమని కోరారు. అలా కాని పక్షంలో ఇదే తరహా సన్నివేశాలు భవిష్యత్తులో వచ్చే అవకాశం ఉందని..
కొన్ని మతాలవారి సెంటిమెంట్‌కు అది ఇబ్బంది కలిగించవచ్చని వివరించారు. బోర్డు తరపు న్యాయవాది వాదనలు విన్న న్యాయస్థానం దీనిపై ఒక నిర్ణయానికి రావాలని చిత్రబృందాన్ని ఆదేశించింది. థ్రిల్లర్ కథాంశంతో ‘జానకి వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ చిత్రాన్ని ప్రవీణ్ నారాయణన్ రూపొందించారు. సత్యం ఎప్పటికైనా విజయం సాధిస్తుందనేది ఉప శీర్షిక. ఇందులో జానకిగా అనుపమ కనిపించను న్నారు.
లాయర్‌గా ప్రముఖ నటుడు సురేశ్ గోపి నటించారు. కోర్ట్‌రూమ్ డ్రామా మూవీ విషయంలో సెన్సార్ బోర్డు అభ్యంతరం వ్యక్తం చేసింది. సీతాదేవి మరో పేరు జానకి కావడం, సినిమాలో లైంగిక దాడికి గురైన మహిళ పాత్రకు ఆ పేరు పెట్టడం సమంజసం కాదని సెన్సార్ బోర్డు చిత్ర బృందానికి తెలిపింది. సినిమా పేరు మార్చాలని కోరింది. అంతేకాకుండా, పలు కట్స్ సూచించింది. సెన్సార్ నిర్ణయంపై టీమ్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ కోర్టును ఆశ్రయించింది.