calender_icon.png 11 February, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కృష్ణా నుంచి ఏపీ నీళ్ల దోపిడీ

11-02-2026 02:24:07 AM

  1. సీఎం రేవంత్‌రెడ్డి చోద్యం
  2. సర్కార్ నడుపుతున్నరా.. సర్కస్ నడుపుతున్నరా?
  3. కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీశ్‌రావు ధ్వజం 

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి) : కష్ణా నదీ జలాలను ఏపీ అప్పనంగా తీసుకుపోతుంటే .. సీఎం రేవంత్‌రెడ్డి మాత్రం జూబ్లీహిల్స్ ప్యాలెస్‌లో కూర్చొని చోద్యం చూస్తున్నారని మాజీ మంత్రి హరీశ్‌రావు విమర్శించారు. ఇండ్లెంట్లు లేవు, బోర్డు అనుమతులు లేకుండానే ఏపీ ఇష్టారాజ్యంగా కష్ణా నీళ్లను తీసుకెళ్లుతోందన్నారు. 664 టీఎంసీలకు గాను 80శాతం నీళ్లు ఏపీ వాడుకున్నదని, ఇంతగా ఏపీ వినియోగిస్తుంటే సీఎంతో పాటు నీళ్ల శాఖ మంత్రి ఏం చేస్తున్నడని హరీశ్‌రావు ప్రశ్నించారు. మంగళవారం ఆయన తెలంగాణ భవన్‌లో మీడియా తో మాట్లాడుతూ .. ఇంకా రెండు రోజుల్లో ఏపీ వినియోగం వాటా దాటుతుందన్నారు.

తెలంగాణ ఇరిగేషన్ శాఖ ఈఎన్‌సీ కేఆర్‌ఎంబీకీ వెంటనే బోర్డు మీటింగ్ పెట్టండి, ఏపీ నీటి దోపిడీని ఆపాలని జనవరి 28న లేఖ రాసిందని తెలిపారు. కేఆర్‌ఎంబీకి జనవరి 28న లేఖరాసిన ఈఎన్‌సీ జనవరి 31న రిటైర్ అయ్యారని, ఆ తర్వాత వారం రోజుల వరకు ఆ పోస్టులు భర్తీ చేయలేదని హరీశ్‌రావు మండిపడ్డారు. వాటాలు, మాటలు కుదరకపోవడంతోనే ఈఎన్‌సీ పోస్టులను ఖాళీగా పెట్టారని, తాము ప్రశ్నిం చాకనే భర్తీ చేశారని ఆయన తెలిపారు. చేతులు కాలినంక ఆకులు పట్టుకున్నట్లు.. ఏపీ నీటిని మొత్తం వాడుకున్నాక ఉత్తరాలు రాయడం తప్ప ఏం చేస్తున్నారని హరీశ్‌రావు నిలదీశారు.

సీఎం రేవంత్‌రెడ్డి అపెక్స్ కౌన్సిల్ మీటింగ్ కోసం పెట్టాలని ఎందుకు అనటం లేదన్నారు. రేవంత్ గురువు చంద్రబాబుకు శ్రీశైలం, నాగార్జున సాగర్ నుంచి నీళ్లు తరలించుకుపోతుంటే ఈ ప్రభుత్వం కండ్లు మూసుకొని ప్రవర్తిస్తుందని హరీశ్‌రావు మండిపడ్డారు. తెలంగాణ 34 శాతం వాటాకు గాను 20 శాతం మాత్రమే వాడుకున్నదని తెలిపారు.

ఏపీ ప్రభుత్వం రోజుకు 1.5 టీఎంసీల నీళ్లు తీసుకెళ్లుతుంటే తెలంగాణ పరిస్థితి ఏమి కావాలని ఆయన ప్రశ్నించారు. తెలంగాణ 174 వాడుకోవాల్సి ఉంటుందన్నారు. మహబూబ్ నగర్, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల్లో పంటల పరిస్థితి ఏం కావా లి..? రేవంత్‌రెడ్డి సర్కారు నడుపుతున్నరా..? సర్కస్ నడుపుతున్నరా..? అని ఆయన ధ్వజమెత్తారు. సీఎంకు పాలన మీద పట్టులేకపోవడమే కారణమన్నారు. తాము ప్రశ్నించినప్పుడే ప్రభుత్వం మేల్కొంటే తెలంగాణకు నష్టం జరగకపోయేదన్నారు.