calender_icon.png 11 February, 2026 | 5:34 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

సాహో.. సంజయ్!

11-02-2026 02:18:02 AM

‘టాక్ ఆఫ్ ది పొలిటీషియన్’గా కీర్తిప్రతిష్ఠలు

బీజేపీ కార్యకర్తలకు ఆయన ఆదర్శ శిఖరం

  1. పిలిస్తే పలికే నాయకుడిగా గుర్తింపు 
  2. కేంద్ర మంత్రి స్థానంలో ఉన్నా.. తొణకని నిరాడబరత
  3. మున్సిపల్ ఎలక్షన్‌లో అన్నీ తానై ఎన్నికల ప్రచారం
  4. ప్రత్యర్థులే నివ్వెరపోయేలా సాధారణ కార్యకర్తలా క్యాంపెయిన్

హైదరాబాద్, ఫిబ్రవరి 10 (విజయక్రాంతి): తెలంగాణ రాజకీయాలపై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ తనదైన ముద్ర వేస్తూ సమకాలీన రాజకీయ నేతలకు ఆదర్శంగా నిలుస్తున్నారు. రాజకీయాలంటే కార్యకర్తలను అవసరానికి వాడుకుని వదిలేయడమే ట్రెండ్‌గా మారిన ఈ రోజుల్లో బండి సంజయ్ అందుకు భిన్నంగా అడుగులు వేస్తూ వారికి నిత్యం వెన్నంటి ఉంటున్నారు. తన గెలుపునకు కారణమైన కార్యకర్తలందరి రుణం తీర్చుకుంటున్నారు.

కార్యకర్త జీవితాంతం కార్యకర్తగానే ఉండాలా? అనే ప్రశ్నకు ‘నేటి కార్యకర్తే రేపటి లీడర్’ అనే నినాదానికి చిరునామాగా మారారు. మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలోని కరీంనగర్ కార్పొరేషన్, వేములవాడ, సిరిసిల్ల, హుస్నాబాద్, హుజూరాబాద్, జమ్మికుంట, చొప్పదండి మున్సిపాలిటీల్లో గెలుపోటములతో సంబంధం లేకుండా ఎన్ని ఒత్తిళ్లు వచ్చినా లెక్క చేయకుండా నూటికి 80 శాతం మంది నిఖార్సయిన, నిబద్ధ్దత కలిగిన కార్యకర్తలకే కార్పొరేటర్, కౌన్సిలర్ టిక్కెట్లు ఇచ్చారు. ఎన్నికలంటే గెలుపే అన్ని పార్టీలకు ప్రతిపాదిక. అధికారం లేనప్పుడు జెండా పట్టుకుని పార్టీ ఇచ్చే అన్ని కార్యక్రమాల్లో పాల్గొనేది కార్యకర్తలే...

తీరా ఎన్నికల టైమొచ్చేసరికి మాత్రం గుర్రాలకే టిక్కెట్లు ఇవ్వడం అనే కారణంతో కార్యకర్తలను పక్కన పెట్టడం అన్ని రాజకీయ పార్టీల్లో తంతుగా మారింది.  బండి సంజయ్ మాత్రం ఈ తంతును పూర్తిగా చెరిపేసే ప్రయత్నం చేశారు. పార్టీ కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన కార్యకర్తలకే గత పంచాయతీ ఎన్నికల్లో టిక్కెట్లు ఇవ్వడమే కాకుండా ఆర్థిక వనరులను కూడా స్వయంగా సమకూర్చారు.  అభ్యర్థుల గెలుపు బాధ్యతలను సైతం పూర్తిగా తన భుజాన వేసుకున్నారు. ఫలితంగా తన పార్లమెంట్ పరిధిలో 108 సర్పంచ్ స్థానాలను కైవసం చేసుకుని రికార్డు సృష్టించారు. 

మున్సిపల్ ఎన్నికల్లో సైతం..

ఈసారి మున్సిపల్ ఎన్నికల్లో సై తం ఇతర పార్టీల నుంచి పెద్ద ఎత్తున లీడర్లు బీజేపీలో చేరేందుకు యత్నించినా వాళ్లకు టిక్కెట్లు ఇచ్చేందుకు మాత్రం బండి సంజయ్ ససేమిరా అ న్నారు. పార్టీ కోసం కష్టపడి ఏ ళ్ల తరబడి పనిచేసిన కార్యకర్తలకే పెద్ద పీట వేశారు. నూటికి 80 శాతం మంది కట్టర్ కార్యకర్తలకే కా ర్పొరేటర్, కౌన్సిలర్ టిక్కెట్లను కేటాయించడమే కాకుండా వారిని గెలిపించే బాధ్యత లను పూర్తిగా తన భుజానా వేసుకుని ఎన్నికలను ఒంటి చేత్తో నడిపించారు.

బీజేపీ పక్షాన పోటీ చేసిన అభ్యర్థుల్లో 90 శాతం మంది పేద, మధ్య తరగతి కుటుంబాలకు చెం దిన వారే. రాష్టంలో ఎన్నడూ అధికారంలో లేకపోవడం, ఆయా అభ్యర్థులు  సైతం ఎన్నడూ అధికారిక పదవుల్లో కూడా లేకపోవడంతో  వారి ఆర్థిక పరిస్థితి అంతంత మా త్రంగా ఉంది. కుటుంబ నిర్వహణే కష్టంగా ఉన్న అభ్యర్థుల కుటుంబాలు చాలా ఉన్నాయి. అలాంటి వారందరికీ ఎన్నికలకు అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా స్వయంగా బం డి సంజయ్ అందించారు. కొంత మంది అభ్యర్థులకు నా మినేషన్ పత్రాలకు అవసరమైన డిపాజిట్ సొమ్మును కూడా బండి సంజయ్ పంపించడం గమనార్హం.

గెలుపు వాతావరణాన్ని సృష్టించేందుకు అభ్యర్థుల పక్షాన డివిజన్లలో పెద్ద ఎత్తున స్ట్రీట్ కార్నర్ మీటింగ్ లు, సభలు నిర్వ హించారు. అందుకయ్యే ఖర్చునంతా బండి సంజయ్ భరించారు.  అట్లాగే అభ్యర్థుల పేరిట కరపత్రాలను స్వయంగా ప్రింట్ చేయించి పంపించారు. అట్లాగే కరీంనగర్ కార్పొరేషన్ తోపాటు ఆయా మున్సిపాలిటీల అభివృద్ధికి తాను ఎం తగా కృషి చేశానో చెబుతూ... కేంద్రం నుంచి తెచ్చిన నిధులతో జరిగిన అభివృద్ధి వివరాలతో బుక్ లెట్ ను రూపొం దించి ఇంటింటికీ పంపిణీ చేయించి అభ్యర్థులను గెలిపించాలని అభ్యర్థించారు.  

గల్లీ గల్లీ తిరుగుతూ..

ఎన్నికల ప్రచార వ్యవధి తక్కువగా ఉండటంతో పొ ద్దున్నే 6 మొదలు రాత్రి 10 గంటలదాకా కార్యకర్తల గెలుపు కోసం గల్లీగల్లీలోనూ తిరుగుతూ విస్తృత ప్రచారం నిర్వహిస్తూ ఓట్లను అభ్యర్థించారు. ప్రచార సమయం ముగిసిన తరువాత సైతం పోల్ మేనేజ్‌మెంట్, మరుసటి రోజు పార్టీ కార్యక్రమాల నిర్వహణపై కసరత్తు చేశారు. బీజేపీ అభ్యర్థులను అలర్ట్ చేస్తూ వారు పోటీ చేసే డివిజన్లలో, మున్సిపల్ వార్డుల్లో బీజేపీ గెలుపు తథ్యం అనే వాతావరణం కల్పించడంలోనూ బండి సంజయ్ అలుపెరగకుండా పనిచేశారు. 

ప్రతిపక్షాల ప్రశంసలు

బండి సంజయ్ పడుతున్న తపన, చెమటోడుస్తున్న తీరును చూసి సొంత పార్టీ నేతలే కాదు, ప్రత్యర్థి పార్టీల నాయకులు సైతం నివ్వెర పోతున్నారు. కార్యకర్తల పట్ల ఇంతటి ప్రేమ, బాధ్యత కలిగిన లీడర్‌ను మేము ఇంతకు ముందెన్నడూ చూడలేదు... ఇక భవిష్యత్తులోనూ చూస్తామనే నమ్మకం లేదు”అని ప్రతిపక్ష పార్టీల నాయకులు, కార్యకర్తలే ప్రశంసల జల్లు కురిపిస్తున్నారు. బండి సంజయ్ పడుతున్న కష్టాన్ని చూసి ప్రజలు సైతం ‘శభాష్ సంజయ్‌”అంటూ అభినందిస్తున్నారు. ఇక బీజేపీ కార్యకర్తల సంగతి చెప్పనక్కర్లేదు...‘సాహో సంజయన్న...నీవే మాకు అండా దండా...మీ వెంట మేమంతా”అంటూ కొనియాడటం విశేషం.