01-05-2025 12:24:54 AM
రాజేంద్రనగర్, ఏప్రిల్ 30: ఎలాంటి ప్రభుత్వ అమతి లేకుండా కాలుష్యం వెదజల్లే రెడీమిక్స్ ప్లాంట్ కొనసాగుతుంది. ఇటీవలనే పొంచి ఉన్న కాలుష్యం... రోగాల బారిన ప్రజలని ’విజయక్రాంతి’ లో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పం దించి రెడ్ మిక్స్ ప్లాంట్ కు నోటీసులు జారీ చేశారు. కానీ ఇప్పటివరకు క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకపోవడంపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.
దీంతో స్థానికులు రెడ్ మిక్స్ ప్లాంట్ పై పూర్తిస్థాయిలో చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే శంషాబాద్ మండల పరిధి లోని నర్కూడ గ్రామంలో గత కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా రెడీమిక్స్ ప్లాంటు కొనసాగుతోంది. 111 జీవో పరిధిలో నిర్వహిస్తున్న ఈ ప్లాంట్ కారణంగా నిత్యం తీవ్రమైన కాలుష్యం వెదజల్లుతుంది.
దీంతో స్థానికులు పలుసార్లు పంచాయితీ, వివిధ శాఖల అధికారులు, స్థానిక ప్రజాప్రతినిధులకు తమ సమస్యను వెల్లిబుచ్చారు. ప్రజల సమస్యలను గుర్తించి విజయక్రాంతి దినపత్రికలో ’నర్కుడపై కాలుష్యపు పడగ’ అనే శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీంతో దీంతో అధికారులు స్పందించారు.
ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నర్కూడ గ్రామపంచాయతీ కార్యదర్శి వజ్ర లింగం సదరు రెడీమిక్స్ ప్లాంటు నిర్వాహకులకు ఎంపీడీవో మున్నీ ఆదేశాల మేరకు నోటీసులు జారీ చేశారు. రెడీమిక్స్ ప్లాంట్ నిర్వహణకు ఉన్న పత్రాలు, ఇతరత్రా అనుమతులను మూడు రోజుల్లో మండల పరిషత్ కార్యాలయంలో సమర్పించాలని అందులో పేర్కొన్నారు.
కానీ గడువు దాటినా సదరు రెడీమిక్స్ ప్లాంట్ నిర్వాహకులు ఇప్పటివరకు తమ ప్లాంట్ కు సం బంధించి ఎలాంటి అనుమతి పత్రాలు అందజేయకపోవడం విడ్డూరం. అసలు 111 జీవో పరిధిలో ఉన్న నర్కూడ గ్రామంలో రెడీ మిక్స్ ప్లాంట్ నిర్వహణకు ఎలాంటి అనుమతులు లేవు. ప్లాంటు నిర్వహణ వల్ల ప్రతినిత్యం తీవ్ర వాయు కాలుష్యం,దుమ్ముధూళి రావడంతో వృద్ధులు, చిన్నారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు.
కాలు ష్యం పంటల దిగుబడి పై కూడా ప్రభావం పడుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఏర్పాటై న రెడ్ మిక్స్ ప్లాంట్ పై అధికారులు చర్యలు తీసుకోకపోవడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు విజ్ఞప్తి చేస్తున్నారు.
చర్యలు తీసుకుంటాం....
రెడీమిక్స్ ప్లాంట్ కు ఇప్పటికే రెండుసార్లు నోటీసులు జారీ చేశాం. ఈ విషయం ఇటీవల నా దృష్టికి వచ్చింది. రెడీమిక్స్ ప్లాంట్ కు సంబంధించి పూర్తి వివరాలు సేకరించి తగిన చర్యలు తీసుకుంటాం.
మధుసూదన్ రెడ్డి, ఇంచార్జి ఎంపిఓ