16 August, 2026 | 2:29 AM

పొలిమేర3లో విరావి పాత్రలో అర్జున్ సర్జా

16-08-2026 12:00 AM

ఓటీటీలో ‘మా ఊరి పొలిమేర’తో సంచలనం సృష్టించి, ‘పొలిమేర2’తో థియేట్రికల్ బ్లాక్‌బస్టర్ విజయాన్ని అందుకున్న మిస్టిక్ థ్రిల్లర్ ఫ్రాంచైజ్ ఇప్పుడు తదుపరి అధ్యాయంలోకి అడుగుపెట్టింది. ‘పోలిమేర-3’తో ప్రేక్షకుల ముందుకు రానున్న ఈ సినిమాను వంశీ నందిపాటి ఎంటర్‌టైన్‌మెంట్స్, శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్‌ఎల్‌పీ పతాకాలపై వంశీ నందిపాటి, జాన్వీ నారంగ్ నిర్మిస్తున్నారు. డాక్టర్ అనిల్ విశ్వనాథ్ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ మూడో భాగాన్ని చిత్రబృందం ఇటీవలే ప్రారంభించిన సంగతి తెలిసిందే.

ఇందులో యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా ‘విరావి’గా ఓ పవర్‌ఫుల్ పాత్రలో కనిపించబోతున్నారు. ఆగస్టు 15న అర్జున్ పుట్టినరోజు సందర్భంగా మేకర్స్ ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఈ మేరకు అర్జున్ సర్జా మొహం కనిపించకుండా విడుదల చేసిన పోస్టర్‌లో ఆయన కండలు తిరిగిన చేతిపై ఉన్న పరమశివుని త్రిశూలం, శ్రీమహావిష్ణువు సుదర్శన చక్రం టాటూలు అందరి దృష్టిని ఆకర్షిస్తున్నాయి.

త్వరలోనే ఫస్ట్‌లుక్‌ను విడుదల చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ‘పొలిమేర’, ‘పొలిమేర-2’ల్లో తన నటనతో ప్రేక్షకుల ప్రశంసలు అందుకున్న ఐకానిక్ కొమురయ్య పాత్రలో సత్యం రాజేశ్ మరోసారి అలరించనున్నారు. తాజా చిత్రంలో కామాక్షి భాస్కర్ల పాత్ర కూడా కీలకంగా ఉండనుంది. గెటప్ శ్రీను, బాలాదిత్య, రాకేందు మౌళి ఇతర ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు.