calender_icon.png 22 November, 2025 | 8:45 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అగ్నిపథ్‌తో ఆర్మీ సంస్కరణలు

27-07-2024 04:27:08 AM

  1. సైన్యాన్ని బలోపేతం చేయడమే ఈ పథకం లక్ష్యం 
  2. విపక్షాల విమర్శలను తిప్పికొట్టిన ప్రధాని మోదీ 
  3. కార్గిల్ యుద్ధస్మారకం వద్ద అమరవీరులకు నివాళి 
  4. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తామని వెల్లడి

కార్గిల్, జూలై 26: అగ్నిపథ్‌పై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలను ప్రధాని మోదీ తిప్పికొట్టారు. సాయుధ బలగాలను పునరుజ్జీవింపజే యడమే అగ్నిపథ్ పథకం లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు. దేశ సైన్యాన్ని బలోపేతం చేయడంతో పాటు ఆధునీకరించడం కోసమే ఈ సంస్కరణ చేపట్టామన్నారు. కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా శుక్రవారం లద్ధాక్‌లోని కార్గిల్ యుద్ధస్మారకం వద్ద అమరజవాన్లకు ప్రధాని మోదీ నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ప్రధాని మాట్లాడుతూ..  రాజకీయ నాయకులకు సెల్యూట్ చేయడానికి, పరేడ్లు చేయడా నికి సైన్యం పనిచేయడం లేదని.. 140 కోట్ల భారతదేశ ప్రజల విశ్వాసం అని మోదీ స్పష్టం చేశారు. బార్డర్‌లో, సమస్యాత్మక ప్రాంతాల్లో దేశాన్ని రక్షించే యువరక్తం ఆర్మీకి అవసరమన్నారు. దేశ భద్రతకు సంబంధించి తాము తీసుకున్న ఉత్తమ సంస్కరణపై విపక్షాలు చిల్లర రాజకీయాలు మానుకోవాలన్నారు. కాగా అగ్నిపథ్ పథకాన్ని పునఃసమీక్షించాలని విపక్షాలు డిమాండ్ చేస్తున్నాయి.   

ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో పెకిలిస్తాం..

దుష్ప్రవర్తనకు పాల్పడినప్పుడల్లా భారత్ చేతిలో పాకిస్థాన్ ఓటమిని చవి చూసిందని.. చరిత్ర నుంచి ఆ దేశం ఎలాంటి గుణపాఠాలు నేర్చుకోలేదని ప్రధాని నరేంద్ర మోడీ అన్నా రు. కార్గిల్ యుద్ధంలో అసువులు బాసిన భారత జవాన్ల త్యాగం అజరామరమని అన్నా రు. కార్గిల్ యుద్ధ సమయంలో మన దేశ జవాన్లు చూపించిన పరాక్రమానికి దాయాది దేశం తలవంచక తప్పలేదని అన్నారు. 

కవ్వింపు చర్యలకు పాల్పడుతోంది..

జమ్ముకాశ్మీర్‌లో నిత్యం కవ్వింపు చర్యలకు పాల్పడుతున్న పాకిస్థాన్ దేశానికి లద్ధాక్ వేదిక నుంచి ప్రధాని మోదీ గట్టి హెచ్చరిక పంపించారు. నేను మాట్లాడే మాటలు ఆ దేశానికి నేరుగా చేరుతాయనే ఆశిస్తున్నాను. ఉగ్రవాదులను పాకిస్థాన్ పెంచి పోషిస్తోందని.. దీనికి తోడు భారత సరిహద్దులో దాడులకు పాల్పడేందుకు విఫలయత్నాలు చేస్తోందన్నారు. ఉగ్రవాదాన్ని, ఉగ్రవాదులను కూకటివేళ్లతో పెకిలిస్తామని మోదీ స్పష్టం చేశారు. కాగా 1999 జూలై 26న భారత సైన్యం దాదాపు మూడు నెలల సుధీర్ఘ యుద్ధం తర్వాత కార్గిల్ సెక్టార్‌లో నియంత్రణ రేఖ దాటి భారత్‌లోకి ప్రవేశించిన చొరబాటుదారులను తరిమికొట్టడంతో పాటు ఆయా స్థావరాలను ఆక్రమించుకుంది. యుద్ధంలో పాకిస్థాన్‌పై భారత్ సాధించిన విజయానికి గుర్తుగా ప్రతి ఏడాది జూలై 26న ‘కార్గిల్ విజయ్ దివస్’గా పాటిస్తారు.

షింకున్ లా టన్నెల్ పనుల ప్రారంభం..

ఈ సందర్భంగా షింకున్ లా టన్నెల్ ప్రాజెక్టు నిర్మాణ పనులను ప్రధాని మోదీ  ప్రారంభించారు. టన్నెల్ వద్ద వర్చువల్‌గా తొలి బ్లాస్ట్ చేశారు.  4.1 కిలోమీటర్ల పొడవైన ఈ టన్నెల్ అత్యవసర పరిస్థితుల్లో సాయుధ బలగాలను తరలించేందుకు ఉపయోగపడుతుంది.