27-07-2024 04:30:56 AM
హైదరాబాద్, సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 26 (విజయక్రాంతి): రాష్ట్రంలో కొత్త రెవెన్యూ చట్టం అమల్లోకి రాబోతుంది. వచ్చే నెలలోనే అందుకు సంబంధించిన ముసాయిదా ప్రజల ముందు పెట్టనున్నారు. కొత్త చట్టంలోని అంశాలపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అన్ని రాజకీయ పార్టీల అభిప్రాయాలను తీసుకోవడంతో పాటు ప్రజల నుంచి సూచనలు సలహాలను స్వీకరించి అసెంబ్లీలో చర్చించిన తర్వాత నూతన రెవెన్యూ చట్టంను అమల్లోకి తీసుకువస్తామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు.
శుక్రవారం ధరణి కమిటీ సభ్యులతో పాటు రెవెన్యూశాఖ ముఖ్య అధికారులతో, రెవెన్యూ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కలిసి సీఎం రేవంత్ రెడ్డి నూతన రెవెన్యూ చట్టం, ధరణి సమస్యల పరిష్కారంపై సచివాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. ప్రస్తుతం రెవెన్యూ చట్టంలో ఉన్న లోపాలు, ధరణి వెబ్‌సైట్‌లో చేయాల్సిన సవరణలపై భూచట్టాల నిపుణులు భూమి సునీల్‌తో పాటు సీసీఎల్‌ఏ కమిషనర్ నవీన్ మిట్టల్, ధరణి పీడీ వీ లచ్చిరెడ్డి, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి రేమండ్ పీటర్ తదితరులతో సుదీర్ఘంగా చర్చించిన సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో భూ సమస్యలకు శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యం అన్నారు.
అందుకు ధరణితో పాటు రాష్ట్రంలో ఉన్న భూ సమస్యలపై, నూతన చట్టం ముసాయిదాపై లోతైన అధ్యయనం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు సూచించారు. రాష్ట్రంలో రోజురోజుకు భూ సమస్యలు పెరుగుతున్నాయని, వీటికి నూతన రెవెన్యూ చట్టమే పరిష్కారం అని సీఎం రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. గత ప్రభుత్వం ప్రజలతో సంబంధం లేకుండానే చట్టం రూపొందించిందని, కానీ ప్రస్తుతం ప్రజల సమస్యల పరష్కారం కోసం, ప్రజలతో చర్చించి, ప్రజల అభిప్రాయాలు తీసుకున్న తర్వాతనే నూతన చట్టం ముసాయిదాకు ఆమోదం తెలుపాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులకు స్పష్టం చేశారు.
గ్రామస్థాయి నుంచి రాష్ట్రస్థాయికి..
ఒకప్పుడు గ్రామ స్థాయిలోనే రెవెన్యూ రికార్డులు అందుబాటులో ఉండేవని, కానీ క్రమంగా మండలానికి, ఆ తర్వాత జిల్లాకు, రాష్ట్రస్థాయికి వెళ్లాయని, దీంతో భూ సమస్యలున్న రైతులకు తిప్పలు తప్పడం లేదన్నారు. అలాగే గతంలో రైతులకు తలెత్తిన భూ సమస్యలపై అప్పీల్ చేసుకునే అవకాశం ఉండేదని సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ధరణి కారణంగా గ్రామ, మండల స్థాయిలో రైతుల సమస్యలకు పరిష్కారం లభించడం, సమస్త అధికారాలను జిల్లా కలెక్టర్లకు అప్పగించాలని, దీంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని సీఎం రేవంత్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే కలెక్టర్లు తీసుకునే నిర్ణయాలను ప్రశ్నించే అవకాశం లేకుండా ధరణిని రూపొందించారన్నారు.
అఖిలపక్ష సమావేశం..
నూతన రెవెన్యూ చట్టంపై అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలతో పాటు ప్రజల ఆమోదంతో నూతన రెవెన్యూ చట్టంను తీసుకువస్తామని సీఎం అన్నారు. అయితే నూతన చట్టం ముసాయిదాపై విస్తృత సంప్రదింపులు చేయాలని, ప్రజల నుంచి సలహాలు, సూచనలు స్వీకరించాలని సీఎం రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. అందరి అభిప్రాయాలతో సమగ్ర చట్టం రూపొందించాలని సీఎం అధికారులకు సూచించారు. భూదాన్, పోరంబోకు, బంచరాయి, ఇనాం, కాందిశికుల భూ సమస్యలున్న ఓ మండలాన్ని ఎంపిక చేయాలని సీఎం సూచించారు. అయితే నాగార్జున సాగర్ నియోజకవర్గ పరిధిలోని తిరుమలగిరి మండలంలో పైలెట్ ప్రాజెక్టు చేపట్టాలని మాజీ మంత్రి జానారెడ్డి సీఎం రేవంత్ రెడ్డిని కోరారు.
ఇందుకు సీఎం సానుకూలంగా స్పందించడంతో పాటు పైలెట్ ప్రాజెక్టులో భాగంగా గుర్తించిన సమస్యలతోపాటు వాటి పరిష్కారంపై అసెంబ్లీలో చర్చించి ప్రభుత్వం తుది నిర్ణయం తీసుకుంటుందని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క, రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు కేశవరావు, సీఎం సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ మంత్రి జానా రెడ్డి, ధరణి కమిటీ సభ్యులు కోదండ రెడ్డి, మధుసూదన్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి శేషాద్రి తదితరులు కూడా పాల్గొన్నారు.