టన్నులుగా కల్తీ నెయ్యి
130 కేంద్రాలపై హెచ్- ఫాస్ట్ దాడులు
36 టన్నుల నకిలీ సరుకు సీజ్
హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, స్వీట్ షాపులకు కల్తీ నెయ్యి సరఫరా
తిన్నవారికి స్లో పాయిజన్
హైదరాబాద్: హైదరాబాద్‌లో కల్తీ నెయ్యి తయారీ విచ్చలవిడిగా పెరుగుతోంది. సువాసనలు వెదజల్లే కల్తీ నెయ్యిని టన్నులు టన్నులుగా తయారు చేస్తూ, హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, స్వీట్ షాపులకు కల్తీ నెయ్యి సరఫరా చేస్తూ ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు.
ఈ విషయాన్ని పసిగట్టిన హైదరాబాద్ సిటీ పోలీసులు కల్తీ రాయుళ్లపై కొరడా ఝుళిపించారు. టాస్క్‌ఫోర్సుకు చెందిన ‘హైదరాబాద్ ఫుడ్ అడల్టరేషన్ సర్వైలెన్స్ టీమ్’ (హెచ్ ఫాస్ట్) ఫుడ్ సేఫ్టీ అధికారులు సంయుక్తంగా ౧౩౦ కేంద్రాల్లో నిర్వహించిన దాడుల్లో దాదాపు 36 టన్నుల కల్తీ నెయ్యి, ప్రమాదకర ముడి పదార్థాలను స్వాధీనం చేసుకున్నారు. ఈ అంతర్రాష్ట్ర కల్తీ దందా గుట్టును హైదరాబాద్ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ మంగళవారం మీడియా సమావేశంలోవివరాలు వెల్లడించారు.
టాస్క్ ఫోర్స్ డీసీపీ గైక్వాడ్ వైభవ్ రఘునాథ్, ఐపీఎస్ నాయకత్వంలో హెచ్-ఫాస్ట్ బృందాలు నగరం నలుమూలలా ఉన్న 39 తయారీ కేంద్రాలు, 91 విక్రయ శాలలపై ఏకకాలంలో దాడులు జరిపాయి. 25.5 టన్నుల కల్తీ నెయ్యి, ముడి సరుకు 8.7 టన్నులు, పామ్ ఆయిల్ 1,200 లీటర్లు, వనస్పతి (డాల్డా)600 లీటర్లు, స్టార్చ్ (పిండి పదార్థం)30 కేజీలు, కృత్రిమ సువాసన రసాయనాలు 3 రకాలకు చెందిన 6 బాటిళ్లు, బొట్టు పాలు లేకుండానే ‘సింథటిక్ నెయ్యి’ స్వాధీనం చేసుకున్నారు. కనీసం బొట్టు పాలు లేదా పాల కొవ్వు వాడకుండా.. కేవలం పామాయిల్, వనస్పతి, స్కిమ్డ్ మిల్క్ పౌడర్, స్టార్చ్, ప్రమాదకర రసాయన ఎసెన్స్ కలిపి నకిలీ నెయ్యిని తయారు చేస్తున్నట్లు అధికారులు గుర్తించారు.
దీనికి మహారాష్ట్ర, తమిళనాడు, ఉత్తరప్రదేశ్, గుజరాత్, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి ముడి సరుకును దిగుమతి చేసుకుంటున్నారు. ఎలాంటి (ఎఫ్ ఎస్ ఎస్ ఏ ఐ లైసెన్స్) బ్యాచ్ నంబర్లు, గడువు తేదీలు లేకుండా 100% ప్యూర్ దేశీ నెయ్యి, ప్రీమియం నెయ్యి పేర్లతో ప్లాస్టిక్ కవర్లలో ప్యాక్ చేసి హోటళ్లు, రెస్టారెంట్లు, ఫంక్షన్ హాళ్లు, స్వీట్ షాపులు, దవాసాజ్లకు సరఫరా చేస్తున్నారు. ఈ కల్తీ నెయ్యిలో ట్రాన్స్-ఫ్యాట్స్ అధికంగా ఉండటం వల్ల గుండె జబ్బులు, పక్షవాతం, లివర్, కిడ్నీ రుగ్మతలు మరియు చర్మ అలర్జీలు వస్తాయని సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. ప్రజల ప్రాణాలతో ఆడుకునే అక్రమార్కులపై పీడీ యాక్ట్ కింద కేసులు నమోదు చేస్తామన్నారు. ప్రభుత్వ లైసెన్స్, సరైన సీల్ ఉన్న గుర్తింపు పొందిన బ్రాండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, తక్కువ ధరకు లభించే బ్రాండ్ లేని, విడి నెయ్యిని కొనవద్దన్నారు.






