calender_icon.png 11 September, 2025 | 11:53 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గణేశ్ నిమజ్జనానికి బందోబస్తు

04-09-2025 01:04:10 AM

  1. 30 వేల మంది పోలీసులతో పహారా
  2. రూట్ మ్యాప్‌ను పరిశీలించిన సీపీ, కమిషనర్
  3. శాంతియుతంగా శోభాయాత్రే లక్ష్యం.. సీపీ సీవీ ఆనంద్
  4. 72 కృత్రిమ కొలనులు, 400కు పైగా క్రేన్లు ఏర్పాటు 
  5. కమిషనర్ ఆర్‌వీ కర్ణన్

హైదరాబాద్ సిటీ బ్యూరో, సెప్టెంబర్ 3 (విజయక్రాంతి): మహానగరంలో ఈ నెల 6న జరగనున్న గణేశ్ నిమజ్జన శోభాయాత్రను ప్రశాంత వాతావరణంలో, సజావుగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నట్లు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ తెలిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు తావులేకుండా దాదాపు 30 వేల మంది పోలీసు సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఆయన స్పష్టం చేశారు.

బుధవారం నగర పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్, రాచకొండ సీపీ సుధీర్ బాబు, అదనపు సీపీ విక్రమ్ సింగ్ మాన్, ట్రాఫిక్ జాయింట్ సీపీ జోయల్ డేవిడ్, హైదరాబాద్ కలెక్టర్ హరిచందన దాసరి తదితర ఉన్నతాధికారుల బృందం క్షేత్రస్థాయిలో పర్యటించి ఏర్పాట్లను సమీక్షించింది. క్షేత్రస్థాయి పర్యటనకు ముందు, బాలాపూర్ గణనాథుని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

బాలాపూర్ గణేశుడి శోభాయాత్ర ప్రారంభమయ్యే ప్రాంతం నుంచి చార్మినార్, మోజమ్ జాహి మార్కె ట్, తెలుగు తల్లి ఫ్లైఓవర్ మీదుగా నెక్లెస్ రోడ్డులోని పీపుల్స్ ప్లాజా వరకు రూట్ మ్యాప్ను అధికారులు స్వయంగా పరిశీలించారు. 

జీహెచ్‌ఎంసీ సర్వం సిద్ధం :కమిషనర్ కర్ణన్

ఈ సందర్భంగా జీహెచ్‌ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణన్ మాట్లాడుతూ నిమజ్జనం కోసం అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో 20 ప్రధాన చెరువులతో పాటు, ప్రత్యేకంగా 72 కృత్రిమ కొలనులను సిద్ధం చేశాం.

నిమజ్జనాన్ని సులభతరం చేసేందుకు 134 స్థిర క్రేన్లు, 259 మొబైల్ క్రేన్లను ఏర్పాటు చేశాం. ఊరేగింపు మార్గాల్లో వెలుతురు కోసం 56,187 తాత్కాలిక లైట్లను అమర్చాం, అని ఆయన వివరించారు. హుస్సేన్ సాగర్లో పర్యాటక శాఖ సహకారంతో 9 బోట్లు, 200 మంది గజ ఈతగాళ్లతో కూడిన డీఆర్‌ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచామన్నారు. 303 కిలోమీటర్ల ప్రధాన ఊరేగింపు మార్గంలో 160 గణేశ్ యాక్షన్ బృందాలు పనిచేస్తాయని తెలిపారు.