17-01-2026 08:09:18 PM
ఏడుపాయల్లో మాఘ స్నానం ఆచరించనున్న వేలాది మంది భక్తజనం
నిండుకుండలా వనదుర్గా ప్రాజెక్టు, చెక్ డాం
భక్తుల సౌకర్యార్థం ఏర్పాట్లు పూర్తయ్యాయన్న ఈవో చంద్రశేఖర్
250 మంది పోలీసులతో బందోబస్తు
విజయక్రాంతి,పాపన్నపేట: మంజీరా "ఏడు" పాయలుగా చీలి ప్రవహించే ప్రసిద్ధ ప్రాంతం.. దేశంలోనే రెండో వనదుర్గామాత ఆలయం.. జనమేజయుని సర్పయాగస్థలిగా వినతికెక్కిన ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన పాపన్నపేట మండలం ఏడుపాయల వనదుర్గా మాత సన్నిధిలో ప్రతి మాఘ అమావాస్య పర్వదినాన వనదుర్గమ్మ చెందన మాఘస్నానాలు చేసేందుకు లక్షలాదిగా భక్తులు ఇక్కడికి తరలి వస్తారు. మంజీరాలో పుణ్య స్నానమాచరించి వనదుర్గమ్మకు మొక్కులు మొక్కుకుంటారు.
వనదుర్గమ్మ చెంత పుణ్య స్నానమాచరిస్తే సకల పాపాలు తొలగిపోతాయని భక్తుల ప్రగాఢ నమ్మకం, మాగస్నానం ఆచరించడానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఆలయ ఈవో చంద్రశేఖర్, సిబ్బంది ఘనంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం చెంతనే ఉన్న వనదుర్గా ప్రాజెక్టు నిండుకుండలా జలకల సంతరించుకుంది. భక్తులు తనివితీరా పుణ్య స్నానం ఆచరించవచ్చు. భక్తులు పుణ్య స్నాన మాచరించేటప్పుడు నీటి ప్రమాదాల బారిన పడకుండా ఉండేందుకు గజ ఈత గాళ్లను ఏర్పాటు చేశారు. సుమారు 250 మంది పోలీసులతో బందోబస్తు కల్పించనున్నారు.