24-10-2025 11:49:47 AM
బెల్లంపల్లి, (విజయక్రాంతి) : బెల్లంపల్లి పట్టణంలోని ఏఎంసి నెంబర్ టు గ్రౌండ్ లో ఈ నెల 26న భారీ ఎత్తున నిర్వహించనున్న మెగా జాబ్ మేళా కోసం సింగరేణి మందమర్రి ఏరియా అధికారులు అన్ని ఏర్పాట్లు చేపడుతున్నారు. సుమారు నాలుగు నుంచి ఐదు వేల మంది నిరుద్యోగ అభ్యర్థులు ఈ మేళాకు హాజరయ్యే అవకాశాలు ఉండడంతో వారికి త్రాగునీరు, భోజన ఏర్పాట్లు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నారు. ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ ను శుభ్రం చేసి విశాలంగా మార్చారు. చిల్డ్రన్స్ పార్కును కూడా అభ్యర్థులకు అందుబాటులోకి తీసుకువచ్చారు.
సింగరేణి యాజమాన్యం ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్న మెగా జాబ్ మేళా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని, నిరుద్యోగ అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని మందమర్రి జిఎం ఎన్ రాధాకృష్ణ ఆధ్వర్యంలో ఏరియా అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేపడుతున్నారు. ఇందులో భాగంగానే బెల్లంపల్లిలో జాబ్ మేళా నిర్వహించనున్న ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ ను పలుసార్లు సందర్శించి నిరుద్యోగ అభ్యర్థులకు అవగాహన కల్పించేలా గోడ ప్రతులను ఆవిష్కరించారు. పట్టణంలోని పలుచోట్ల మెగా జాబ్ మేళా కు సంబంధించిన గోడ ప్రతులను సింగరేణి సిబ్బందితో అంటిస్తూ ప్రచారం చేస్తున్నారు.
దరఖాస్తు చేసుకోవాలిలా..!
సింగరేణి సంస్థ ఎంతో ప్రతిష్టాత్మకంగా ఈ నెల 26న బెల్లంపల్లి ఏఎంసి నెంబర్ 2 గ్రౌండ్ లో నిర్వహిస్తున్న మెగా జాబ్ మేళాలో అభ్యర్థులు వివిధ ఉద్యోగాల కోసం ఎలా దరఖాస్తు చేసుకోవాలో అవగాహన కల్పిస్తున్నారు. ఏడవ తరగతి నుండి, ఇంటర్మీడియట్, డిగ్రీ, ఇంజనీరింగ్, ఫార్మసీ చదివిన నిరుద్యోగ అభ్యర్థులకు ఇదొక సువర్ణ అవకాశమని చెబుతున్నారు. ఐటీ, నాన్ ఐటి, మాను మ్యానుఫ్యాక్చర్, సర్వీస్ సెక్టార్, ఫార్మా లతోపాటు వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నట్లు చెబుతున్నారు. ముందుగా జాబ్ మేళాలో పాల్గొనే అభ్యర్థి గోడ ప్రతి లోని క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి రిజిస్ట్రేషన్ లింకులోకి వెళ్లి తమ డాటా ను ఫిల్ చేయాల్సి ఉంటుంది. డాటాను ఫిల్ చేస్తే కన్ఫర్మేషన్ మెయిల్ వస్తుంది.
ఇందులో ఎక్నాలెడ్జ్మెంట్ ఫీడ్ అవుతుంది. ఈ ఎక్నాలెడ్జ్మెంట్ ను ప్రింట్ తీసుకొని దానికి అభ్యర్థులు తమ డాక్యుమెంట్స్ జతచేసి స్థానికంగా నిర్వహించే ఇంటర్వ్యూకు హాజరు కావాలి. ఒక్కొక్క అభ్యర్థి కనీసం ఐదు కంపెనీలకు తమ దరఖాస్తులను అందించి ఇంటర్వ్యూలకు హాజరు అయ్యే అవకాశం సింగరేణి యాజమాన్యం కల్పించింది. పలు కంపెనీలు నిర్వహించే ఇంటర్వ్యూలలో అర్హత సాధించిన అభ్యర్థులకు అక్కడికక్కడే కంపెనీ నియామక పత్రాలు అందించే ఏర్పాట్లు చేపడుతోంది.హైదరాబాదు, కరీంనగర్, మంచిర్యాల,పెద్దపల్లి, జగిత్యాల ప్రాంతాలలో కూడా అర్హత పొందిన నిరుద్యోగులకు ఈ జాబ్ మేళా ద్వారా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు సింగరేణి యాజమాన్యం సంసిద్ధమయింది.