calender_icon.png 24 October, 2025 | 3:51 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కర్నూలు బస్సు ప్రమాద బాధితులకు సహాయక చర్యలు

24-10-2025 12:53:39 PM

20 మంది ప్రయాణికులు మృతి

తెలంగాణ నుంచి 13 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12, ఇతర రాష్టాల ప్రయాణికులు 

గద్వాల,(విజయక్రాంతి):  కర్నూలు జిల్లా కల్లూరు మండలం చిన్నటేకూరు గ్రామ సమీపంలో శుక్రవారం తెల్లవారుజామున జరిగిన ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ప్రమాద(Kurnool bus accident) ఘటనలో మృతిచెందిన, క్షతగాత్రుల కుటుంబ సభ్యులకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టినట్లు జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టర్ బి.ఎం. సంతోష్(Jogulamba Gadwal Collector) తెలిపారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి(Chief Minister Revanth Reddy) ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం గద్వాల జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు తో కలిసి ప్రమాద ఘటన స్థలాన్ని కలెక్టర్ పరిశీలించారు.

హైదరాబాదు నుంచి బెంగళూరు బయలుదేరిన వేమూరి కావేరి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో(Vemuri Kaveri Private Travels Bus) మొత్తం 41 మంది ప్రయాణికులతో పాటు డ్రైవర్, క్లీనర్ ఉన్నట్లు తెలిసిందన్నారు. ఈ ఘటనలో 20 మంది ప్రయాణికులు మృతి చెందినట్లు ప్రాథమికంగా తెలిసిందన్నారు. వైద్య సిబ్బంది బస్సులోని మృతదేహాలను వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు చెప్పారు. క్షతగాత్రులు కర్నూలు ప్రభుత్వాసుపత్రి తో పాటు పలు ప్రైవేట్ ఆస్పత్రిలోనూ చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. పోస్టుమార్టం నివేదికను బట్టి మృతదేహాలను వారి కుటుంబ సభ్యులకు అప్పగించడం జరుగుతుందన్నారు.

బస్సులో తెలంగాణ నుంచి 13 మంది, ఆంధ్రప్రదేశ్ నుంచి 12 మంది, ఇతర రాష్ట్రాల నుంచి మిగతావారు ప్రయాణిస్తున్నట్లు ప్రాథమిక సమాచారం మేరకు తెలిసిందన్నారు. కర్నూలు జిల్లా యంత్రాంగానికి జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్, అధికార యంత్రాంగం పూర్తి సహాయ, సహకారాలు అందించడమే కాక బాధిత కుటుంబ సభ్యులకు అవసరమైన సమాచారం అందించేందుకు గద్వాలలోని కలెక్టరేట్, పోలీసు కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్, హెల్ప్ డెస్క్ ఫోన్ నెంబర్లను అందుబాటులో ఉంచామన్నారు.

జోగులాంబ గద్వాల జిల్లా కలెక్టరేట్ కంట్రోల్ రూమ్ నెంబర్: 9502271122.

జోగులాంబ గద్వాల జిల్లా హెల్ప్ డెస్క్ నంబర్స్: 9100901599, 9100901598. 

జోగులాంబ గద్వాల జిల్లా పోలీస్ కార్యాలయ కంట్రోల్ రూమ్ నెంబర్: 8712661828. 

కర్నూలు ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి కంట్రోల్ రూమ్ నెంబర్: 9100901604.