23-08-2025 01:12:17 AM
కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి
హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): గ్రేటర్ హైదరాబాద్ సమస్యల పరిష్కారానికి శాంతియుతంగా సచివాలయం ముట్టడికి పిలుపునిచ్చిన బీజేపీ కార్యకర్తలను అరెస్టు చేయడం సరికాదని కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్‌రావుతో పాటు మాజీ ఎమ్మెల్యేలు, కార్పొరేటర్లు, మహిళా మోర్చ, పార్టీ నాయకులను అరెస్టు చేసిన కాంగ్రెస్ ప్రభుత్వ చర్యలను ఖండిస్తున్నట్లు చెప్పారు.
శుక్రవారం ఆయన పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడాతూ.. గ్రేటర్ పరిధిలోని సమస్యలను పరిష్కరించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని దుయ్యబట్టారు. డ్రైనేజీ వ్యవస్థ, రోడ్లు, కరెంట్, మంచినీటి వ్యవస్థ, ట్రాఫిక్ వంటి సమస్యలతో నగరం ప్రజలు నరకం అనుభవిస్తున్నారని మండిపడ్డారు. చిన్నపాటి వర్షాలకే హైదరాబాద్ అతలాకుతలమవుతో ందన్నారు.
అరెస్టుల పేరుతో నిరంకుశ విధానాలను కొనసాగిసతే ప్రజలకు తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. విద్యుత్ వైర్లు తగిలి యువకులు ప్రాణాలు కోల్పోతున్నారని, వీధి లైట్లు లేక రాత్రివేళల్లో నగర ప్రజలు ఇబ్బంది పడుతున్నారని తెలిపారు. జీహెచ్‌ఎంసీ అధికారుల మధ్య సమన్వయం లేదన్నారు. వీధి కుక్కల నియంత్ర ణను జీహెచ్‌ఎంసీ గాలికి వదిలేసిందని, మహానగరంలో శాంతిభద్రతలు అదుపు తప్పుతున్నాయన్నారు.