calender_icon.png 23 August, 2025 | 4:57 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మా వాటా మాకే కావాలి

23-08-2025 01:09:51 AM

  1. తరలించే నీటిలో సగం ఇవ్వాల్సిందే 
  2. గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టు ఖర్చు కేంద్రమే భరించాలి 
  3. ఏపీ ఇంట్రా లింకు ప్రాజెక్టులకు ఒప్పుకోం
  4. ఇచ్చంపల్లికి బదులు సమ్మక్క సాగర్‌ను పరిగణనలోకి తీసుకోవాలి 
  5. ఎన్‌డబ్ల్యూడీఏ సమావేశంలో తెలంగాణ ప్రతిపాదనలు 
  6. ఏపీ ఇంట్రా లింకులను ఆమోదించొద్దని కోరాం 
  7. బనకచర్ల అంశం చర్చకు రాలేదు 
  8. ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా

హైదరాబాద్, ఆగస్టు 22 (విజయక్రాంతి): గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టులో భాగంగా తరలించే నీటిలో తమ వాటా తమకే కావాలని తెలంగాణ ప్రభుత్వం డిమాండ్ చేసింది. ఏపీలో ఆ రాష్ర్ట ప్రభుత్వం చేపట్టాలనుకుంటున్న నాలుగు నదుల అనుసంధాన (ఇంట్రా లింక్) ప్రాజెక్టులకు ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదని తేల్చి చెప్పింది. గోదావరి-కావేరి నదుల అనుసంధానంపై జాతీయ నీటి అభివృద్ధి(ఎన్‌డబ్ల్యూడీఏ) ఆధ్వర్యంలో ఆరో విడత సంప్రదింపుల సమావేశాన్ని శుక్రవారం హైదరాబాద్‌లోని జలసౌధలో నిర్వహించారు.

కేంద్ర జలసంఘం చైర్మన్ అతుల్ జైన్ నేతృత్వంలో జరిగిన ఈ భేటీకి తెలంగాణ, ఏపీ, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల అధికారులు హాజరయ్యారు. కర్ణాటక, మహారాష్ట్ర, తమిళనాడు, కేరళ, పుదుచ్చేరి రాష్ట్రాల అధికారులు వర్చువల్‌గా హాజరయ్యారు. ఒడిశా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలు సమావేశంలో పాల్గొనలేదు. తెలంగాణ తరఫున నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా, ప్రత్యేక కార్యదర్శి ప్రశాంత్ పాటిల్, ఈఎన్‌సీ అంజద్ హుస్సేన్ తదితరులు పాల్గొన్నారు.

గోదావరి జలాల్లో ఛత్తీస్‌గఢ్‌కు కేటాయించిన 145 టీఎంసీల నీటిని కావేరికి అనుసంధానించాలన్న ప్రతిపాదన ఉండగా ఇందుకోసం ఇచ్చంపల్లి వద్ద ఆనకట్ట నిర్మించి అక్కడి నుంచి గోదావరి నీటిని కావేరికి మళ్లించాలని భావిస్తున్నారు. దీనికోసం అన్ని భాగస్వామ్య రాష్ట్రాలతో మాట్లాడి ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లే ప్రక్రియ గత కొంతకాలంగా కొనసాగుతోంది. ఇందులో భాగంగానే ఎన్‌డబ్ల్యూడీఏ ఆరో విడత సమావేశం నిర్వహించింది. సమావేశంలో పాల్గొన్న తెలంగాణ తమ వాదనలను బలంగా వినిపించింది. 

74 టీఎంసీలు కేటాయించాలి

గోదావరి-, కావేరి నదుల అనుసంధాన ప్రాజెక్టుకు సూత్రప్రాయంగా అంగీకరిస్తూనే, పలు కఠిన షరతులు విధించింది. తరలించే నీటిలో సగం వాటా 74 టీఎంసీలు తమకే కేటాయించాలని స్పష్టం చేసింది. ప్రాజెక్టు నిర్మాణానికి భూసేకరణకు అయ్యే ఖర్చును కూడా కేంద్రమే భరించాలని సూచించింది. రాష్ట్రాల మధ్య భవిష్యత్‌లో నీటి వాటాల్లో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూడాల్సిన బాధ్యత కేంద్ర ప్రభుత్వానిదేనని తెలంగాణ అధికారులు ప్రస్తావించారు. ఇచ్చంపల్లి ప్రా జెక్టుకు బదులు సమ్మక్క సాగర్‌ను పరిగణనలకి తీసుకోవాలన్న ప్రతిపాదనను రాష్ట్ర ప్రభుత్వం లేవనెత్తింది. 

గోదావరి-కావేరి లింక్‌కు తెలంగాణ ప్రతిపాదనలు 

‘గోదావరి--కావేరి లింక్ కింద ఇచ్చంపల్లి నుంచి తరలించే 148 టీఎంసీల నీటిలో తెలంగాణకు 74 టీఎంసీలు (50 శాతం వాటా) కేటాయించాలి. అయితే, ఈ విజ్ఞప్తిని ఎన్‌డబ్ల్యూడీఏ తిరస్కరించింది. ముందుగా గోదావరిలో తెలంగాణకు కేటాయించిన 968 టీఎంసీల నీటి వినియోగానికి పూర్తి రక్షణ కల్పించాలి. మా ప్రాజెక్టులైన దేవాదుల (38.16 టీఎంసీలు), సమ్మక్కసాగర్ (46.96 టీఎంసీలు), సీతమ్మసాగర్-సీతారామ (67.05 టీఎంసీలు) కలిపి మొత్తం 152.17 టీఎంసీల నీటి వినియోగానికి తొలి ప్రాధాన్యం ఇవ్వాలి.

అదేవిధంగా ఇచ్చంపల్లి వద్ద బ్యారేజీ నిర్మిస్తే, దానివల్ల సమ్మక్కసాగర్ ప్రాజెక్టు ముంపునకు గురికాకుండా చూడాలి. గేట్ ఆపరేషన్ ప్రోటోకాల్‌పై సిమ్యులేషన్ స్టడీస్ నిర్వహించాలి. మా వాటా కింద ఇచ్చే నీటిని శ్రీరాంసాగర్ లేదా దేవాదుల ఆయకట్టు స్థిరీకరణకే వాడాలన్న నిబంధనను అంగీకరించబోం. రాష్ర్టంలో అవసరమైన ఏ ప్రాంతానికైనా వాడుకునే స్వేచ్ఛ మాకు ఉండాలి.

మా వాటాతో పాటు రాష్ర్టంలోని తాగు, సాగునీటి అవసరాల కోసం ఇచ్చంపల్లి నుంచి 200 టీఎంసీల వరద జలాలను వాడుకునేందుకు అనుమతించాలి. ఇక నీటిని నాగార్జునసాగర్ ప్రాజెక్టులోకి నేరుగా కాకుండా, సాగర్ టెయిల్‌పాండ్‌కు తరలించి అక్కడి నుంచి దిగువకు విడుదల చేయాలి. దీనివల్ల ఎగువన జూరాలపై ప్రభావం పడకుండా ఉంటుంది. అన్ని రాష్ట్రాల మధ్య పూర్తిస్థాయి ఏకాభిప్రాయం కుదిరాకే మెమొరాండం ఆఫ్ అగ్రిమెంట్ పై ముందుకు వెళ్లాలి. ఇప్పుడే సంతకాలు చేయడం తొందరపాటు అవుతుందని’ తెలిపింది.

ఇతర రాష్ట్రాల అభిప్రాయాలు 

2023 సీడబ్ల్యూసీ నివేదికను పరిగణనలోకి తీసుకోవద్దని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కోరింది. గోదావరి-, కావేరి లింక్‌ను ఇచ్చంపల్లికి బదులుగా పోలవరం నుంచే చేపట్టాలంది. కృష్ణా బేసిన్‌లోకి మళ్లించే నీటిలో ఇతర రాష్ట్రాలు వాటా అడగకుండా నిరోధించాని కోరింది. కర్ణాటక మాత్రం తమకు 45 టీఎంసీలు కేటాయించాలని డిమాండ్ చేసింది. ఇంట్రా లింక్ ప్రాజెక్టులకు కేంద్రం నిధులు ఇవ్వదని స్పష్టం చేసినందున, ఇంటర్ లింకింగ్ ప్రాజెక్టును కొనసాగించాలని, తాము ఎంవోయూపై సంతకానికి సిద్ధమని కర్టాటక తెలిపింది.

గోదావరి, కృష్ణా బేసిన్లలో తమదే కీలక పరివాహక ప్రాంతమని, తమకు నీటి వాటా ఇవ్వకపోవడం సరికాదని మహారాష్ర్ట వాదించింది. తమ ఇంట్రా లింక్ ప్రాజెక్టులను జాతీయ ప్రణాళికలో చేర్చాలని డిమాండ్ చేసింది. తాము తమకు కేటాయించిన నీటినే వాడుకుంటామని, ఇతరుల వాటాకు ఎలాంటి ఇబ్బంది కలిగించమని ఛత్తీస్‌గఢ్ హామీ ఇచ్చింది. మొత్తం మీద, ఈ సమావేశంలో రాష్ట్రాల మధ్య భిన్నాభిప్రాయాలు, డిమాండ్లు బలంగా వినిపించడంతో గోదావరి-, కావేరి నదుల అనుసంధానంపై ఏకాభిప్రాయం అంత సులువు కాదని స్పష్టమైంది.

ఇంట్రా లింక్‌లను ఆమోందించొద్దని కోరాం: రాహుల్ బొజ్జా 

చింతలపూడి, ఉత్తరాంధ్ర సుజల స్రవంతి, పల్నాడు కరువు నివారణ ప్రాజెక్ట్, గుండ్రేవుల రిజర్వాయర్లను ఇంట్రా లింక్ కింద చేపట్టేందుకు ఏపీ కేంద్రానికి ప్రతిపాదనలు పంపిందని, ఆ ప్రాజెక్టులన్నీ కృష్ణా, గోదావరి ట్రిబ్యునల్ అవార్డులకు, విభజన చట్టానికి పూర్తిగా విరుద్ధమని ఇరిగేషన్ శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా స్పష్టం చేశారు. వీటిలో కొన్నింటిని కేంద్రమే 2021 గెజిట్ నోటిఫికేషన్‌లో అనుమతి లేని ప్రాజెక్టుల జాబితాలో చేర్చిందని గుర్తు చేశారు.

తెలంగాణ సమ్మతి లేకుండా ఏపీ ప్రతిపాదించిన నాలుగు ఇంట్రా లింకులు ఆమోందించవద్దని కోరినట్టు పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టులను ఏమాత్రం పరిగణనలోకి తీసుకోవద్దని, వాటి డీపీఆర్‌లను అడిగే ఆలోచనను కూడా విరమించుకోవాలని గట్టిగా డిమాండ్ చేశారు. సమావేశంలో బనకచర్ల లింక్ అంశం చర్చకు రాలేదన్నారు. ఈ ప్రాజెక్టుపై రాష్ట్ర ప్రభుత్వ అభిప్రాయాలను గతంలోనే చెప్పామని వివరించారు.

మరోమారు సమావేశం నిర్వహిస్తాం: సీడబ్ల్యూసీ చైర్మన్ 

గోదావరి-కావేరి లింక్ ప్రాజెక్టుకు సంబంధించి మరోసారి సమావేశం నిర్వహిస్తామని సీడబ్ల్యూసీ చైర్మన్ అతుల్ జైన్ వెల్లడించారు. అన్ని రాష్ట్రాల అధికారుల అభిప్రాయం తీసుకున్నామని, వాటిపై సమగ్రంగా పరిశీలిస్తామని తెలిపారు. తర్వాత మరోసారి సమావేశం నిర్వహించి అన్ని రాష్ట్రాల వాదనలు సేకరించడంతోపాటు ప్రాజెక్టుతో సంబంధం ఉన్న అన్ని రాష్ట్రాలు సమావేశంలో పాల్గొనేలా చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. రాబోయే సమావేశంలో నీటి వాటాలపై క్లారిటీ ఇస్తామని సూత్రప్రాయంగా పేర్కొన్నట్టు సమాచారం. త్వరలోనే సమావేశ తేదీని ప్రకటిస్తామని వెల్లడించినట్టు తెలిసింది.