calender_icon.png 23 August, 2025 | 4:56 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

భక్తిశ్రద్ధలతో పొలాల అమావాస్య

23-08-2025 01:12:58 AM

ఆదిలాబాద్, ఆగస్టు 22 (విజయ క్రాంతి): వ్యవసాయం అనే పదానికి అర్థం తెలిపే బసవన్న, రైతన్నల అనుబంధానికి నిదర్శనమే పొలాల పండగ. తెలంగాణ అంటేనే కాలానికి అనుగుణంగా జరుపుకునే పండుగలకు ప్రసిద్ధి గాంచింది. అలాంటి సంస్కృతి, సాంప్రదాయాలకు పుట్టినిల్లు అయిన ఆదిలాబాద్ జిల్లాలో పండగలకు, పబ్బాలకు చాలా ప్రత్యేకతలు ఉంటాయి. ఆ కోవలోకి వచ్చేదే శ్రావణమాసంలో చేసుకునే పొలాల అమావాస్య పండుగ.

వ్యవసాయ రంగంలో ఆరుగాలం శ్రమించే అన్నదాతకు ఏడాది పాటు అండగా నిలిచే బసవన్నలు (ఎడ్లు) కు ఒక్కరోజు విశ్రాంతి ఇచ్చి, వాటిని పూజించే పండగనే పొలాల అమావాస్య పండుగ. మహారాష్ర్టలో ఎక్కువగా జరుపుకునే ఈ పొలాల పండగను మహారాష్ర్టకు ఆనుకొని ఉన్న ఆదిలాబాద్ జిల్లాలో సైతం పెద్ద ఎత్తున నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది.

మనం జరుపుకునే ప్రతి పండుగ మన సంస్కృతి సాంప్రదాయాలను చాటిచెబుతాయని మాజీ మంత్రి జోగు రామన్న అన్నారు. వ్యవసాయంలో సంవత్సరం పాటు రైతన్నకు అండగా నిలిచే ఎడ్లను పూజించే పండగ పొలాల పండుగ సందర్భంగా జైనథ్ మండలంలోని తన స్వగ్రామమైన దీపాయి గూడలో జరిగిన పొలాల వేడుకల్లో మాజీ మంత్రి పాల్గొని, కుటుంబ సమేతంగా ఎడ్లకు ప్రత్యేక పూజలు చేసి గ్రామస్తులతో కలిసి పండగ వేడుకల్లో ఉత్సాహంగా గడిపారు.