calender_icon.png 13 December, 2025 | 11:38 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

మామను కొట్టి చంపిన ఘటనలో అల్లుడు, అతని తల్లిదండ్రుల అరెస్ట్..

13-12-2025 09:36:28 PM

మహబూబాబాద్ (విజయక్రాంతి): వరకట్న వేధింపులతో దాడికి పాల్పడుతూ అడ్డు వెళ్లిన మామను దారుణంగా కొట్టి చంపిన ఘటనలో అల్లుడు సహా అతని తల్లిదండ్రులను పోలీసులు అరెస్ట్‌ చేశారు. మహబూబాబాద్  డిఎస్పీ ఎన్.తిరుపతి రావు విలేకరుల సమావేశంలో వెల్లడించారు. మహబూబాబాద్ జిల్లా గార్ల మండలం మర్రిగూడెం బోజ్యతండాకు చెందిన బానోత్ లాలూనాయక్ మహబూబాబాద్ పాతకలెక్టర్ ఆఫీస్ ప్రాంతంలోని బాలాజీ హిల్స్‌లో నివాసం ఉంటున్నారు. ఆయన కూతురు శ్రీసాయిలహరిని కురవి మండలం గుండ్రాతిమడుగు పెద్దతండాకు చెందిన గూగులోత్ గాంధీబాబు (ప్రస్తుతం మిలిటరీ కాలనీ, మహబూబాబాద్)తో వివాహం చేశారు.

వివాహం జరిగినప్పటి నుంచే అదనపు కట్నం, బంగారం తేవాలంటూ గాంధీబాబు తన తల్లిదండ్రులు, చెల్లితో కలిసి శ్రీ సాయిలహరిని శారీరకంగా, మానసికంగా వేధింపులకు గురి చేశారని తెలిపారు. ఈ వేధింపులపై బాధితురాలు మహబూబాబాద్ టౌన్ పోలీస్‌స్టేషన్‌లో వరకట్న వేధింపుల కేసు నమోదు చేయగా, పెద్దమనుషుల సమక్షంలో సర్దుబాటు చేసి ఆమెను తిరిగి అత్తింటికి పంపారు. అయినప్పటికీ వేధింపులు కొనసాగడంతో పాటు కేసు వెనక్కి తీసుకోవాలని ఒత్తిడి తెచ్చినట్లు పేర్కొన్నారు. ఈ క్రమంలో డిసెంబర్ 11న రాత్రి శ్రీసాయిలహరిపై మళ్లీ దాడికి యత్నించగా, ఆమె వెంటనే తండ్రి లాలూనాయక్‌కు సమాచారం ఇచ్చింది. దీంతో లాలూనాయక్ తన కుమారుడు ప్రదీప్‌తో కలిసి మిలిటరీ కాలనీలోని నిందితుల ఇంటికి వెళ్లారు.

అక్కడ గాంధీబాబు, అతని తల్లిదండ్రులు ముగ్గురు కలిసి లాలూనాయక్, ప్రదీప్‌లపై మాకుమ్మడిగా దాడి చేశారు. తీవ్రగాయాల పాలైన లాలూనాయక్ డిసెంబర్ 12న తెల్లవారుజామున చికిత్స పొందుతూ ఆసుపత్రిలో మృతి చెందారు. ఈ ఘటనపై మృతుడి కుమారుడు ప్రదీప్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు మహబూబాబాద్ టౌన్ ఇన్స్పెక్టర్ జి.మహేందర్ రెడ్డి కేసునమోదు చేసి, 24 గంటల్లోనే నిందితులు గుగులోత్ గాంధీబాబు, గుగులోత్ సీతారాం, గుగులోత్ కవితను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. వేగంగా దర్యాప్తు పూర్తి చేసిన టౌన్ సిఐ, టౌన్ ఎస్సై ఎస్‌కే. షకీర్‌, సిబ్బంది ని డీఎస్పీ ఎన్ తిరుపతి రావు అభినందించారు.