14-08-2024 02:30:00 AM
మనుషి పుట్టుక నుండే ఎన్నో కళలు, కళాకృతులున్నాయి. ఒక్కో కళలో ఒక్కో భావోద్వేగం దాగి ఉండేది. అయితే గ్లోబలైజేషన్ కారణంగా ఆనాటి అరుదైన కళలు కనుమరగువుతున్నాయి. కానీ కొన్ని కళలు మాత్రం నేటికీ కనువిందు చేస్తూ ఆకట్టుకుంటున్నాయి. ఆదివాసీల చేతిలో ప్రాణంపోసుకునే ధోక్రా కళ నేటికీ మనుగడలో ఉంటూ ప్రత్యేకతను చాటుకుంటున్నాయి.
ఛత్తీస్‌గఢ్ ప్రసిద్ధ కళను ధోక్రా కళ అంటారు. ఇది తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా, జైనూర్ మండలంలో విస్తృతంగా కనిపించే గిరిజన హస్తకళ. ఆదిలాబాద్ జిల్లాలో ఉషెగావ్, చిత్తల్ బోరి లాంటి ప్రాంతాల్లో ఈ కళకు విశేషమైన గుర్తింపు ఉంది. దీని ప్రత్యేకత ఏమిటంటే.. క్రాప్ట్‌లోని ప్రతి రూపం మరొకదానికి భిన్నంగా ఉంటుంది. జానపద ఆకృతులు, నెమళ్లు, ఏనుగులు, గుర్రాలు, గిన్నెలు, శవపేటికలు, ఇతర కళారూపాలు వివిధ ట్రెడిషనల్ డిజైన్లలో దొరుకుతుండటంతో అంతర్జాతీయ మార్కెట్‌లో వీటికి ఫుల్ డిమాండ్ ఉంది.
శ్రమతో కూడుకున్న ఈ చేతివృత్తికి కేవలం ఆదివాసీల కుటుంబాలు మాత్రమే అంకితమయ్యాయి. ఆదిలాబాద్ జిల్లాలో నేటికీ ధోక్రా కళలు కనువిందు చేస్తుండటం విశేషం. జంతువులు, పురాణాలు, నిజ జీవిత పాత్రలు, ప్రకృతితో కూడిన గిరిజన మూలాంశాలు ఈ కళలో దాగి ఉంటాయి. టెక్నాలజీ యుగంలోనూ ఆదివాసీ, గిరిజనుల ఇంటిలో ఈ కళారూపాలు కనువిందు చేస్తూ ప్రతేకతను చాటు కుంటున్నాయి. రూపం ఏదైనా అందంగా తయారవుతుంది. పురాణాలు, పర్యావరణం, రోజువారీ జీవితంలోని ఆచారాలు, వనరులు, దేవతలు, సూర్యుడు, చంద్రుడు, అడవులు, జంతువుల లాంటి క్లిష్టమైన చిత్రాలను ఈ ఆర్ట్‌లో చూడొచ్చు.
తరగని ఆదరణ
ఒరిస్సా, మధ్యప్రదేశ్, పశ్చిమ బెంగాల్, కేరళతో సహా అనేక భారతీయ రాష్ట్రాలలో ధోక్రాకు మంచి ఆదరణ ఉంది. తెలంగాణలో మాత్రం కేవలం ఆదిలాబాద్ జిల్లాలో మాత్రమే ఈ కళారూపాలు తయారవుతున్నాయి. కేవలం కొన్ని కుటుంబాలు మాత్రమే పురాతన హస్తకళను కొనసాగిస్తున్నాయి. వీరంతా తరతరాలుగా ధోక్రా క్రాఫ్ట్ మీద ఆధారపడి జీవిస్తున్నారు. ఎందుకంటే వారి ఏకైక ఆదాయ వనరు ఇదే. పిల్లల నుండి వృద్ధుల వరకు మొత్తం కుటుంబం క్రాఫ్ట్ తయారీలో నిమగ్నమవుతూ నేటి ట్రెండ్స్ కు తగ్గటుగా కళాకృతులను తయారుచేస్తున్నారు.
ఇక అప్పటి బస్తర్ పాలకులు ధోక్రా ఆర్ట్‌కు ముగ్దులై మూడు వందల సంవత్సరాల కాలంనాటి కళాకృతులను కొనుగోలు చేశారు. ధోక్రా కళకు కదిలిపోయనా వారు కళాకారులకు ఘద్వా అనే గౌరవ బిరుదును ఇవ్వాలని నిర్ణయించున్నట్టు చరిత్ర పుట్టల్లో చూడొచ్చు. “మేం తరతరాలుగా ధోక్రా ఆర్ట్స్‌ను తయారుచేస్తున్నాం. ఎన్ని కష్టాలు ఎదురైనా కళను విడిచి పెట్టడం లేదు. ఎందుకంటే మాకు తెలిసిన ఇదొకటే కాబట్టి.
ఒక కళారూపాన్ని తయారు చేయడానికి దాదాపు ఐదు రోజులు సమయం పడుతుంది. ఎందుకంటే ఇది చాలా క్లిష్టమైన ప్రక్రియ. నాణ్యతను కాపాడుకోవడానికి బొమ్మలోని ప్రతి అణువుఅణువును చక్కగా తయారుచేయాల్సి ఉంటుంది. చాలా సార్లు ఉత్పత్తిలో నష్టం జరుగుతుంది కూడా” తన అనుభావాలను పంచుకుంది ఓ కుటుంబం.
ఇదీ చరిత్ర
ధోక్రా అనేది సహస్రాబ్దాలుగా విస్తరించి ఉన్న ఒక కళారూపం. ఇది ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిశా రాష్ట్రాల్లో ఈ కళ ప్రబలంగా ఉంది. అయితే ఇది 4000 నుంచి 5,000 సంవత్సరాల క్రితం మొహెంజొదారో నగరంలో ఉద్భవించిందని నమ్ముతారు. ఈ అందమైన కళాఖండాలు చూసేందుకు సరళంగా ఉంటాయి. కానీ దగ్గరగా చూస్తే ఆ అందాన్ని వర్ణించకుండా ఉండలేం. గిరిజనుల ఆలోచనలు ఊహకందనివి. తమకు వచ్చిన ఆలోచనను కళగా మారుస్తూ అద్భుతమైన కళారూపాలను తయారు చేస్తుంటారు. ప్రజలు మెచ్చిన రూపాలకు మెరుగులు దిద్దుతూ అద్భుతమైన విగ్రహాలు, శిల్పాలను తయారు చేస్తూ ధోక్రా ఆర్ట్‌ను తమలో భాగం చేసుకున్నారు. చూసేందుకు అదొక ఆర్ట్ అయినప్పటికీ దాని వెనుక ఓ భావోద్వేగం, అనుభూతులు ఉంటాయి.
-ఎక్కడ పుట్టింది
‘ధోక్రా’ అనే పేరు పశ్చిమ బెంగాల్‌లోని ధోక్రా డమర్ తెగల నుండి వచ్చింది. వారు మొదట ఈ కళారూపాన్ని అభ్యసించారు. ఆ తర్వాత దక్షిణ భారత దేశానికి విస్తరించింది. ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, తెలంగాణలో నేటికీ ఈ కళను నేర్చుకునేవారు ఉన్నారు. ఈ కళారూపాన్ని బస్తర్ ఆర్ట్ అని కూడా పిలుస్తారు. అయితే మొదట్లో ఝరా, ఘద్వా తెగలు మాత్రమే తయారుచేసేవారు. అయితే నేటి తయారీదారులకు సరైన ఆదాయం లేకపోవడంతో ఈ పురాతన క్రాఫ్ట్‌ను కొనసాగించడానికి ఆసక్తి చూపడం లేదు.
ధోక్రాకు ప్రత్యేక గుర్తింపు
తెలంగాణలోని ఆదిలాబాద్ గిరిజన ప్రాంతాల్లో తయారయ్యే ధోక్రా కళకు ప్రత్యేకమైన గుర్తింపు కూడా ఉంది. తెలంగాణలోని ఈ కళను మాత్రమే నమ్ముకున్న తయారీదారులకు ఎంతో పేరు ప్రఖ్యాతులు తెచ్చేలా ధోక్రా ఆర్ట్ కు చెన్నైలోని జీఐ రిజిస్ట్రీ జియోగ్రాఫికల్ ఇండికేషన్ (జీఐ) రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జారీ చేసింది. అయితే ప్రస్తుతం తెలంగాణలోని కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ మండలంలో కొన్ని కుటుంబాలు మాత్రమే ఈ అరుదైన కళను ప్రపంచానికి పరిచయం చేస్తున్నాయి.
హైదరాబాద్ నుంచి 264 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఈ గ్రామానికి వెళ్తే అద్భుమైన శిల్పాలు, విగ్రహాలు ఆకట్టుకుంటాయి. ధోక్రా కళలను తయారు చేయడం అంత ఈజీ కాదు. వ్యవసాయ వ్యర్థాల నుంచి సేకరించిన స్థానిక బంకమట్టిని ఊటతో కలుపుతారు. ఆ తర్వాత కళారూపం తగ్గట్టుగా ఒక అచ్చును ముద్రిస్తారు. అనంతరం ఆ మట్టి, ఇత్తడి లోహాన్ని కలుపుతారు. ఈ మిశ్రమాన్ని అచ్చులను తయారుచేయడానికి ఉపయోగిస్తారు. అనేక మిశ్రమాలతో ఐదు రోజులపాటు శ్రమించి అద్భుతమైన శిల్పాలను తయారుచేస్తారు.