calender_icon.png 26 August, 2025 | 9:30 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

గోంధళ్ వారి ఛోన్‌కా సంభళ్ వాద్యాలు

14-08-2024 02:30:00 AM

దేవి ఉపాసనలో ఒక భాగం గోంధళ్. పాత నైజాం సంస్థానంలో తెలుగు, మరాఠీ, కన్నడ భాషల్లో గోంధళీ ప్రదర్శన విరివిగా ఉండేది. ఈ కథా ప్రదర్శన ప్రస్తుతం తెలంగాణలో అంతరించిపోయే దశలో ఉంది. మహబూబ్‌నగర్ పరిసర ప్రాంతాల్లో ఒకళ్లిద్దరు కళాకారులు మాత్రమే మరాఠీ, తెలుగు భాషల్లో ఈ కథ చెప్పగలుగుతారు. 

ఇది ప్రాచీన గోంధళీ నృత్యం మాదిరిగా ఉంటుంది. గోంధళీ కథనంలో వాడే వాయిద్యాలు విశిష్టమైనవి. మొగలిపాద కాండంతో తయారు చేసిన ‘ఛోన్ కా’ మన జమిడకని పోలి ఉంటుంది. జమిడిక కంటే పెద్దదిగా ఉంటుంది ఈ ఛోన్‌కా. ఉక్కు తీగతో వెదురుబొంగు మీదుగా బిగించుకుంటారు. దీనిపై భాగంలో నల్లటేకుతో చేసిన పిణ్ణితో నాదం సరిచూసుకుంటారు. ‘ఛోన్‌కా‘ కింది భాగం మేకచర్మంతో మూస్తారు. ‘ఛోన్‌కా‘ వాద్యం మధ్యలో ఒక రూపాయిబిళ్ల వేసి బిగించి అమర్చుకోవడం జరుగుతుంది.

అందువల్ల శబ్దం విస్తారంగా పలుకుతుంది. గోంధళ్ కథ చెప్పే నాయకుడు ఈ వాద్యాన్ని ఉపయోగిస్తాడు. సంభళ్ వాద్యకారులు ఇద్దరూ పక్కపక్కనే కూర్చుని వాయిస్తారు. కథనంలో భాగంగా సంగీతపరంగా సంభళ్ ప్రాముఖ్యత ఎన్నదగింది. ఇత్తడి డోళ్ల మీద ఇనుము తో చేసి ఒక చట్రాన్ని అమర్చి దాన్ని చర్మంతో మూస్తారు. దానికి తొమ్మి రంధ్రాలు చేస్తారు. ఆ తొమ్మిది రంధ్రాల్లో తొమ్మిది తాళ్లని తొమ్మిది ముళ్లతో బిగిస్తారు. బిగువు కోసం చెక్కముక్కల్ని అమరుస్తారు. వీటిని ఘోడో అంటారు. ఇలా తయారుచేసుకున్న ‘సంభళ్‘ ని ‘కుర్‌పణ్‘ అని వాళ్లు పిలుచుకునే ఒక విభిన్న వాద్యంతో వాయిస్తారు. రెండో చేతిలో ‘కాడీ‘ ఉంటుంది.

వీరి వేషభాసలు కూడా విశిష్టంగా ఉంటాయి. ఇరవై ఇరవై అయితే మీటర్ల గుడ్డతో కుట్టిన అంగీ, మెడలో అరవై నాలుగు గువ్వలతో పాటు దారం, దూదితో చేసిన ఉండలు అమర్చి ఉంటాయి. ఈ దండతో పాటు తుల్జాభవాని పతకం ఉంటాయి. తలకి పాగ, కాళ్లకు గజ్జెలు, నడుముకి బిగించిన ఉత్తరీయం వీరి ఆహార్యం. ఛోన్‌కా, సంభళ్ విడివిడి వాయిద్యాలే అయినా వీటిని గోంధల్ కళాకారులు వాయిస్తుంటే ఒక్క చక్కని సంగీత ప్రవాహం జాలువారుతుంది. సంభళ్ జోడు వాయిద్యం వాటిమీద పుల్లలతో వాయిస్తారు. ఇది రాజన్న చామల్లాలి వాద్యం వంటింది. ఈ రెండింటికీ అతి దగ్గరి పోలిక ఉంది.