11-10-2025 12:00:00 AM
ఆకేరులో ఆగని ఇసుక దందా..
మహబూబాబాద్, అక్టోబర్ 10 (విజయక్రాంతి) : మహబూబాబాద్ జిల్లాలో నెల్లికుదురు, నరసింహులపేట, చిన్న గూడూరు, మరిపెడ మండలాల పరిధిలో ప్రవహిస్తున్న ఆకేరు వాగులో తోడుకున్నోళ్లకు తోడుకున్నంతగా ఇసుక దందా సాగుతోంది. ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పేరుతో ఇటీవల ఇసుక దందా మరింత పెచ్చు మీరిందనే విమర్శలు వస్తున్నాయి. ఓవైపు వర్షాలతో వాగులో వరద ప్రవాహం ఉన్నప్పటికీ, కూలీలకు ట్రాక్టర్కు 1,500 నుండి 2000 రూపాయల వరకు ట్రిప్పుకు చెల్లిస్తూ ఇసుకను ఎడాపెడా తోడేస్తున్నారు.
ఇందిరమ్మ కూపన్ల జారీ వ్యవహారం పూర్తిగా గాడి తప్పిపోయిందనే విమర్శలు వస్తున్నాయి. ఎక్కడపడితే అక్కడ ఇందిరమ్మ ఇండ్ల పేరుతో ఇసుకను తోడుకుంటూ, అడ్డగోలుగా ఇసుకను తరలిస్తూ దళారులు అందిన కాడికి దండుకుంటున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనల ప్రకారం ప్రభుత్వం నిర్దేశించిన ఇసుక రీచ్ నుంచి ఇసుక తరలించాల్సి ఉండగా, నాలుగు మండలాల పరిధిలో ఎక్కడపడితే అక్కడ ఇసుక తోడుతున్నారనే విమర్శలు వస్తున్నాయి.
ఇందిరమ్మ గృహ నిర్మాణ లబ్ధిదారులకు ప్రభుత్వం రాయితీపై ఇసుక సరఫరా చేయడానికి ఇస్తున్న కూపన్లు పక్కదారి పట్టిస్తున్నారని విమర్శలు వస్తున్నాయి. 6 వేలకు ట్రిప్పు చొప్పున జిల్లాలోని ఇతర ప్రాంతాలకు ఇసుక రవాణా చేస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. ఇసుక రవాణా కోసం ప్రత్యేకంగా ట్రాక్టర్ల యజమానులు ఎక్కడికక్కడే సిండికేట్ గా మారినట్లు విమర్శలు వస్తున్నాయి.
ఇసుక అక్రమ రవాణాను అడ్డుకోవలసిన పోలీస్, రెవెన్యూ, మైనింగ్ శాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి కూడా చూడడం లేదనే విమర్శలు వస్తున్నాయి. పత్రికల్లో వార్తలు వచ్చినప్పుడు మొక్కుబడిగా ఇసుక రవాణా చేయకుండా వాగు వెంట పలుచోట్ల కందకాలు తీసి వదిలివేయడం, ఆ తర్వాత మళ్లీ ట్రాక్టర్ల యజమానులు కందకాలను పూడ్చి యదేచ్చగా ఇసుక రవాణా సాగిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి.
ఎక్కడ కూడా సరైన నిఘా లేదని, పర్యవేక్షించాల్సిన అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వల్ల ఆకేరు వాగు ఇసుక అక్రమ రవాణాకు కేంద్రంగా మారిందనే విమర్శలు వస్తున్నాయి. ఇసుక అక్రమ దందాలో పార్టీల నే‘తల’దూర్చడంతో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి. దీనితో ఆకేరు వాగు పూర్తిగా డొల్లగా మారి వాగు పరివాహక ప్రాంతం పూర్తిగా భూగర్భ జలాలు అడుగంటిపోయి పంటల సాగుకు ఇబ్బందిగా మారుతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
నిత్యం వాగు వెంట నాలుగు మండలాల పరిధిలో వేల సంఖ్యలో ట్రాక్టర్లు బాహాటంగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్న పట్టించుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. అనేక ట్రాక్టర్లకు కనీసం నంబర్ ప్లేట్లు కూడా లేకపోవడం వల్ల ఇసుక అక్రమ రవాణా దందాకు తార్కానంగా నిలుస్తోంది. ఈ విషయంపై వివిధ శాఖల అధికారుల వివరణ కోరగా, ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం కోసం కూపన్లు జారీ చేస్తున్నామని, ఇసుక అక్రమ రవాణా చేస్తున్నట్లు తమ దృష్టికి వస్తే చర్యలు తీసుకుంటామని చెప్పడం కొస మెరుపుగా మారింది.